తెలంగాణ

telangana

ETV Bharat / state

హమ్మయ్యా ఆ పెద్దపులి వెళ్లిపోయింది - ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు

ఎట్టకేలకు కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోకి పెద్ద పులి - ఊపిరి పీల్చుకున్న ఉమ్మడి ఆదిలాబాద్​ ప్రజలు

TIGER WANDERING IN TELANGANA
Tiger Wandering in Adilabad District Latest Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Tiger Wandering in Adilabad District Latest Updates :ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో గత వారం రోజులుగా తిరుగుతున్న పెద్దపులి ఎట్టకేలకు కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో అడుగుపెట్టింది. కవ్వాల్‌ పులుల సంరక్షణ పరిధిలోకి వచ్చే పెంబి అడవుల్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు పెంబితండా వద్ద రైతులకు కనిపించింది. దీంతో వెంటనే రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పెంబితండా భీమన్న చెరువు ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు. ఇప్పటికే సమీప అటవీ ప్రాంతంలో ట్రాప్​ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు ఎఫ్‌ఆర్వో రమేశ్​రావు వెల్లడించారు. కాగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పసుపుల, ఘట్టిగూడెం గ్రామ అటవీ శివారులో పెద్దపులి అరుపులు వినిపించినట్లు గ్రామస్థులు చెప్పారు.

పెంబి భీమన్న చెరువు ప్రాంతంలో పులి పాదముద్రలు సేకరిస్తున్న అటవీ అధికారులు (ETV Bharat)

వారం రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లోనూ సంచరించింది. తొలుత మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోని అప్పారావుపేట్‌ బీట్‌ పరిధిలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టారు. పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్న తరుణంలో మళ్లీ జిల్లాలోని కుంటాల, హన్మాన్‌నగర్‌ తండా ప్రాంతాల్లో కనబడింది. కుంటాలలో మార్నింగ్​ వాకింగ్​కు వెళ్లిన ఓ వ్యక్తికి పెద్దపులి కనిపించడంతో వెంటనే అతను ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.

గత కొన్ని రోజులుగా సంచారిస్తున్న పులి :వరి పొలంలో కూడా పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో పొలంలో పనిచేసుకుంటున్న రైతులకు సైతం పెద్దపులి కనిపించడంతో భయాందోళనకు గురై చెట్టెక్కి కూర్చున్నారు. పెద్దపులి తండాలోకి రాకుండా గ్రామస్థులందరూ కేకలు, డబ్బాలతో చప్పుడు చేయడంతో అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ సైతం అధికారులు పులి పాదముద్రలను సేకరించి నిర్ధారించారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్​లోనూ పెద్దపులి కనబడింది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని ఏదో ఒక చోట పెద్దపులి కనిపిస్తూ ఉందనే వార్త ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోకి పెద్దపులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

వాహనదారుల కంటపడిన 'ఆ పెద్ద పులి' - ఇరువైపులా రోడ్లు మూసివేసిన అధికారులు

'ఆ పెద్దపులి ఇక్కడి నుంచి వెళ్లలేదు - దిశ మార్చి మళ్లీ వచ్చింది - ఒంటరిగా తిరగకండి'

ABOUT THE AUTHOR

...view details