Flood Effect at Konaseema: గోదావరి వరద తగ్గుముఖంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ఉద్ధృతి తగ్గినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంకలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాటన్ బ్యారేజీ వద్ద మరో 2 రోజుల పాటు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగించే అవకాశముంది.
కోనసీమ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 37 లంక గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని లంకల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. 4 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సఖినేటిపల్లి మండలం లాకుపేట, కొత్తలంక, రామరాజులంకలోని ఓఎన్జీసీ కాలనీలో ఇళ్ల ముందు సుమారు 5 అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వీరికి పడవల ద్వారా నీటి డబ్బాలను అధికార యంత్రాంగం అందిస్తున్నారు. ఆహార పొట్లాలు కూడా ఇవ్వాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయి. జాయింట్ కలెక్టర్ నిశాంతి వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. బూరుగులంక రేవు వద్దకు వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. జిల్లాలో అవసరం ఉన్న చోట్ల వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని లంకల్లో ఉన్న సుమారు 300 మందిని నగరానికి తరలించి పునరావాసం కల్పించారు.
ముంపులోనే ముమ్మిడివరం - Floods in konaseema district
అల్లూరి జిల్లాలోని విలీన మండలాలు అయిన చింతూరు, కూనవరం, ఎటపాక, వరరామచంద్రాపురం ప్రజల్లో మళ్లీ గుబులు మొదలైంది. లోతట్టు ప్రాంతాలైన కల్తునూరు, చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం, ఏవీ గూడెం, శ్రీరామగిరి, వడ్డిగూడెం, తుమ్మిలేరు-పోచవరం పంచాయతీలో ని గ్రామాలు సోమవారం నుంచీ వరద నీటిలోనే ఉన్నాయి.
ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కూనవరం ఉదయభాస్కర్ కాలనీ, మసీదు సందు, శబరికొత్తగూడెంలోని చాలా ఇళ్లు ముంపులోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 50 గ్రామాలను వరద చుట్టుముట్టింది. 30వ నంబరు నేషనల్ హైవే మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఒడిశాకు రాకపోకలను ఇంకా పునరుద్ధరించలేదు.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద గురువారం సాయంత్రానికి నీటిమట్టం 33.11 మీటర్ల వరకు ఉంది. 48 గేట్ల నుంచి 10.97 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పోటెత్తుతోంది. జూరాల జలాశయం నుంచి 2.52 లక్షలు, సుంకేసుల నుంచి 2 వేల 95 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31 వేల 784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 855.20 అడుగులు, నీటి నిల్వ 92.4860 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద - ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే?