Flood Affects in Jogulamba Gadwal District :జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామం ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు వరద గ్రామాన్ని ముంచెత్తడంతో తక్షణం వారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 2006లో చిన్నోనిపల్లి జలాశయం నిర్మాణం మొదలుపెట్టారు. అందులో గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది. సాగు భూములు, ఇండ్లు సహా పునరావాసం కోసం అప్పట్లోనే డబ్బులు చెల్లించారు.
పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మౌలిక వసతుల పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. ఏళ్లుగా జలాశయ నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. దీంతో ఎవరి భూముల్లో వాళ్లు సాగు చేసుకుంటూ ముంపు గ్రామంలోనే ఉంటున్నారు. ఇటీవల వానలకు జలాశయంలోకి భారీఎత్తున వరద వచ్చి గ్రామాన్ని ముంచెత్తింది. ప్రస్తుతం జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు.
రెయిన్ ఎఫెక్ట్ - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వైరా జలాశయం - Flood Effect on Khammam District
ఏళ్లు గడిచినా జలాశయం పూర్తి కాకపోవడంతో గ్రామస్థుల ఆలోచన మారింది. అసలు తమ గ్రామం వద్ద రిజర్వాయరే వద్దని ఏళ్లుగా ఆందోళనలు, నిరసనలు, రిలే దీక్షలు చేశారు. జలాశయం వల్ల గద్వాల నియోజకవర్గానికి ఉపయోగం లేదని, నీటినిల్వ తప్ప ఆయకట్టు లేని రిజర్వాయర్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టు సాగునీరు కోసం జలాశయ నిర్మాణాన్ని గత ప్రభుత్వం కొనసాగించింది. చిన్నోనిపల్లి గ్రామస్థులు ఊరు ఖాళీ చేయకపోవడంతో భారీవర్షాలకు ముంపునకు గురికాక తప్పలేదు.