తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్న అపార్ట్​మెంట్లకు 'షాక్​' - 20 కిలోవాట్ల లోడ్​ దాటితే నోటీసులు పక్కా - TRANSFORMERS SET UP ISSUE

మీ అపార్ట్​మెంట్​ కరెంట్​ లోడ్​ 20 కిలోవాట్లకు మించి ఉందా? - విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు తప్పనిసరి - సొంత ఖర్చుతో పెట్టుకోవాలని యజమానులకు నోటీసులు

Transformers Set Up Issue
Transformers Set Up Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 11:00 AM IST

Transformers Set Up Issue : హైదరాబాద్​నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో 15 ఏళ్ల క్రితం 8 ఫ్లాట్లతో ఓ చిన్న అపార్టుమెంటును నిర్మించిన బిల్డర్‌ వాటిని అమ్మేసి వెళ్లిపోయారు. అప్పట్లో ఈ ఫ్లాట్లకు విడివిడిగాను లిఫ్ట్, ఇతర కామన్ అవసరాలకు కలిపి మొత్తం 9 కరెంటు కనెక్షన్లిచ్చారు. ఇప్పుడు వీటి ద్వారా లోడు 20 కిలోవాట్లకు మించి పెరిగినట్లు చెబుతూ ఫ్లాట్ల ఓనర్లు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్‌ సిబ్బంది నోటీసు ఇచ్చారు. దీన్ని పెట్టుకోవాలంటే రూ.3 లక్షలకు పైగా ఖర్చువుతుంది. అంత భారం 8 ఫ్లాట్ల యజమానులపై పడుతుంది.

రాష్ట్రంలో కరెంటు సరఫరాలో సాంకేతిక సమస్యలతో అంతరాయం కలగకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాయి. ప్రతి ఎలక్ట్రికల్​ పోల్​, ట్రాన్స్‌ఫార్మర్‌ను జీపీఎస్‌తో అనుసంధానం చేసి వాటిపై ఎంతలోడు ఉందనే వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్​ చేస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో తొలుత గ్రేటర్‌ హైదరాబాద్​ నగరంలోని ఏ ప్రాంతంలో ఎంత కరెంటు లోడు ఉందనే వివరాలను సిబ్బంది పక్కాగా నమోదు చేస్తున్నారు.

కరెంటు లోడు 20 కిలోవాట్లకు మించి ఉంటే :ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల ట్రిప్‌ అయి కరెంటు సరఫరా నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఎన్ని కనెక్షన్లున్నాయి? వాటి లోడు తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంతవరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 10 వేల అపార్టుమెంట్లు, భవనాల్లో కరెంటు లోడు 20 కిలోవాట్లకు మించి ఉన్నా ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకోనట్లుగా గుర్తించారు. దీనిపై చర్యలు చేపట్టిన డిస్కం సంబంధిత వ్యక్తుల నోటీసులు జారీ చేస్తోంది.

వారంతా సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఒక ఇంట్లో నాలుగైదు పోర్షన్లున్నా లేదా చిన్న అపార్టుమెంట్‌లోనైనా వాటికుండే కనెక్షన్లపై 20 కిలోవాట్లకు మించి లోడు ఉంటే తప్పనిసరిగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. పలుచోట్ల ఇలా ఏర్పాటు చేయకపోవడంతో ఆ లోడు దాని సమీపంలోని ప్రజా ట్రాన్స్‌ఫార్మర్లపై పడటంతో తరచూ ట్రిప్‌ అవడం లేదా కాలిపోవడంతో సరఫరా నిలిచిపోతోంది.

కరెంటు లోడ్​ ఎందువల్ల పెరుగుతోంది :బిల్డర్లు తగిన అనుమతులు లేకుండా, తక్కువ స్థలంలో 5, ఆపై ఫ్లాట్లతో గ్రూప్‌హౌస్‌ పేరుతో కట్టే చిన్న అపార్టుమెంట్లకు ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయడం లేదు. సాధారణంగా ఒక చిన్న ఇంటికి 3- 5 కిలోవాట్ల లోడు కరెంటు కనెక్షన్‌ ఇస్తారు. ఇంట్లో ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరగడంతో ఈ లోడు అధికమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో అదనంగా లోడు పెంచాలని విద్యుత్‌ కార్యాలయంలో ఇంటి యజమాని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

చాలామంది ఇలా చేయకుండానే కరెంటును విచ్చలవిడిగా వాడటం వల్ల లోడు పెరిగి తరచూ ఆ ప్రాంతంలో ట్రిప్పవుతుంది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిలై సరఫరా నిలిచిపోతోంది. వీటితో కరెంటు కోతలు విధిస్తున్నారనే విమర్శలు వస్తున్నందున ప్రభుత్వం సీరియస్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో డిస్కంలు 20కి.వా మించి సామర్థ్యం ఉన్న భవనాలకు నోటీసులు జారీచేస్తున్నట్లు విద్యుత్‌ సిబ్బంది చెబుతున్నారు.

సిబ్బంది అక్రమాలతో సామాన్యులకు ఇబ్బంది :రూల్స్​ ప్రకారం 20 కిలోవాట్లు దాటితే తప్పనిసరిగా ఏ భవనం ఆవరణలోనైనా అది నిర్మాణంలో ఉన్నప్పుడే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయాలి. ఆ తర్వాతే ఆ భవనానికి కరెంటు కనెక్షన్‌ ఇవ్వాలి. కానీ కొందరు బిల్డర్లు స్థానిక విద్యుత్‌ సిబ్బందికి లంచాలు సమర్పించి ట్రాన్స్‌ఫార్మర్లకు వెచ్చించాల్సిన సొమ్మును మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అక్కడ ఫ్లాట్లు కొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారిపై ఇప్పుడు ఆర్థికభారం పడుతోంది.

అపార్టుమెంటు నిర్మించినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ లేకుండా కనెక్షన్లు ఎలా ఇచ్చారని విద్యుత్‌ సిబ్బందిని వారు ప్రశ్నిస్తున్నారు. బిల్డర్లు, సిబ్బంది కుమ్మక్కై పాల్పడిన అక్రమాలకు తమపై ఆర్థికభారం ఎలా మోపుతారని ప్రశ్నిస్తున్నారు. డిస్కం ఖర్చుతోనే పాత భవనాలు, చిన్న అపార్టుమెంట్లలో ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏడేళ్లలో విద్యుత్ డిమాండ్ డబుల్ అవుతుంది - అంచనా వేసిన ట్రాన్స్​కో

వినియోగదారులకు 'కరెంట్' షాక్ - మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - ELECTRICITY CHARGES REVISE IN TG

ABOUT THE AUTHOR

...view details