Heavy Rains in Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 440 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు వివరించింది. పుదుచ్చేరికి 460 కిలో మీటర్లు, నెల్లూరుకు 530 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారే క్రమంలో ప్రకాశానికి ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతంలోని ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో భారీ వర్షం నమోదవుతుందని ప్రకటించింది.
విద్యాసంస్థలకు సెలవు: దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా, మండల అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. విపత్తులను ఎదుర్కొనేలా తీరప్రాంత మండలాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు 33 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అయిదు కేంద్రాల్లోకి 214 మందిని తరలించి భోజన వసతి కల్పించారు. వర్షాల దృష్ట్యా వరుసగా మూడో రోజైన బుధవారం కూడా పాఠశాలలు, కళాశాలలకు ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా సెలవు ప్రకటించారు.
అల్పపీడన ద్రోణితో అల్లకల్లోలంగా మారిన కోస్తా జిల్లాలు - ఆ జిల్లాల్లో రెడ్ అలెర్ట్
తీర ప్రాంత గ్రామాల్లో 60 నుంచి 70 కిలో మీటర్ల మేర బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు నివారించేందుకు 700 స్తంభాలను విద్యుత్తు శాఖ అధికారులు సిద్ధం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు 300 మంది కార్మికులను సమాయత్తం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన మందులను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాలకు సమన్వయంతో తరలించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు నగర పరిధిలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా యంత్రాలతో పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు.