Road Accident in Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇవాళ తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారు చెరువులో మునగడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులున్నారు. మణికంఠ అనే యువకుడు కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసు లోపు వారే. శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి వీరు బయలుదేరినట్లు సమాచారం. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు చనిపోవడానికి కొన్ని గంటల ముందే రోడ్డుపై జరిగిన ఓ యాక్సిడెంట్ చూసి అయ్యో పాపం అంటూ ఆ యువకులు జాలిపడ్డారు. అరేరే ఇలా చనిపోయారేంటి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ వారికేం తెలుసు మరికాసేపట్లో మృత్యుదేవత వారిని కౌగిలించుకుంటుందని.. తెల్లారే సరికి తమ ప్రాణాలు సైతం తెల్లారిపోతాయని.
చెరువు గట్టుపైనే ఒంటరిగా ఉంటూ : జాతీయ రహదారిపై ప్రమాద ఘటన చూసి కొంచెం దూరం వెళ్లారో లేదో వారు ప్రయాణిస్తున్న కారు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద అదుపుతప్పి పల్టీకొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగి ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. కారులో మొత్తం ఆరుగురు యువకులు ప్రయాణిస్తుండగా వారిలో ఒకరు మృత్యుంజయుడిలా అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డాడు. చెరువులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. చుట్టూ చీకటిలో అతని ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చీకటి, ప్రాణాపాయస్థితిలో చెరువులో స్నేహితులు ఉండటంతో ఏం చేయాలో తెలియక బిగ్గరగా అరుచుకుంటూ చెరువు గట్టుపైనే కలియతిరిగాడు.
బాగా ఆకలిగా ఉందని టిఫిన్ చేసి : కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా అతని వద్ద ఫోన్ లేదు. ఈలోగా పాలు పోసేందుకు అటుగా వచ్చిన వ్యక్తిని ఆపి సాయం చేయాలని కోరడంతో అతను పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి మృతదేహాలను వెలికితీశారు. రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు, మార్గమధ్యలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరగటంతో అక్కడ కొంతసేపు ఆగారు. అనంతరం తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోచంపల్లి వెళ్లారు. బాగా ఆకలిగా ఉండటంతో మళ్లీ జాతీయ రహదారిపైకి వచ్చి టిఫిన్ చేశారు. తెల్లవారుతుండటంతో కల్లుతాగి వెళ్దామని కారు మళ్లీ వెనక్కి తిప్పి పోచంపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం :మరోవైపు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులు పేట్‌బషీరాబాద్‌కు చెందిన కార్తీక్ రెడ్డి(23), అనిల్(23)గా పోలీసులు గుర్తించారు.