Five Lack Rupees Theft From A Bike in Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలోని హోటల్ మయూరి వద్ద పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహన డిక్కీలో నుంచి రూ.5 లక్షలు చోరీ అయ్యాయి. ఈ ఘటన అక్కడి స్థానికులలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే లక్ష్మణ చాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగే నరేశ్ అనే వ్యక్తి స్థానిక యూనియన్ బ్యాంకు నుంచి రూ. 5 లక్షల నగదును తన అవసర నిమిత్తం విత్‌డ్రా చేశాడు. అంతలోనే తనకు ఫోన్ రావడంతో తనతో పాటు వచ్చిన అల్లుడు కళ్యాణ్‌కు ఆ డబ్బులను ఇచ్చి బైకు డిక్కీలో పెట్టమని చెప్పాడు.
ముందస్తు ప్రణాళికతోనే కొట్టేశాడు : కళ్యాణ్ ఆ డబ్బులను డిక్కీలో పెట్టిన తర్వాత కొద్ది సేపటికి అతనికీ ఫోన్ రావడంతో డిక్కీకి తాళం వేయకుండా మరిచిపోయి మాట్లాడుతూ బయటకు వెళ్లాడు. దీనిని గమనించిన ఓ దుండగుడు ముందుగా వెళ్లి అక్కడి ప్రాంతాన్ని పరిశీలించాడు. ఎవరు లేరని నిర్ధారణకు వచ్చి వేగంగా ద్విచక్రవాహనం డిక్కీలో నుంచి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత నరేశ్ వచ్చి చూసేసరికి డబ్బులు లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
"నా పేరు నరేశ్. లక్ష్మణ చాంద మండలం వడ్యాల్ గ్రామం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్యాంకులో రూ.5 లక్షలు డ్రా చేశాం. ఆ నగదును మా బావమరిది కొడుకు కల్యాణ్‌కు బైకు డిక్కీలో పెట్టమని ఇచ్చాం. అతను బైకు డిక్కీలో పెట్టడం జరిగింది. తర్వాత ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లాడు. మేము తిరిగి వచ్చి చూసే సరికి డబ్బులు లేవు" -నరేశ్, బాధితుడు