తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌ - నేడు సీఎం రేవంత్​ శంకుస్థాపన - Double Decker Corridor in Telangana

First Double Decker Corridor Launch in Telangana : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం న‌డుం బిగించింది. జాతీయ ర‌హ‌దారి - 44పై ద‌శాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహ‌న‌దారుల క‌ష్టాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు 5.3 కిలోమీట‌ర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పైనే మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. ఈ ర‌కంగా న‌గ‌రంలో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌కు ప్రస్థానం ప్రారంభంకానుంది. అటు బైరామల్‌గూడ కూడలిలో నిర్మించిన రెండోస్థాయి పైవంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

Telangana Elevated Corridor Route Map
First Double Decker Corridor Launch in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 6:44 AM IST

Updated : Mar 9, 2024, 8:50 AM IST

హైదరాబాద్​లో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌

First Double Decker Corridor Launch in Telangana : హైదరాబాద్‌ నలుమూలలా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఎలివేటెడ్‌ కారిడార్‌, మెట్రో రైల్‌ విస్తరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నగరంలో మరో ఎలివేటెడ్‌ డబుల్‌ కారిడార్‌ నిర్మాణానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మ‌ల్కాజిగిరి, మెద‌క్‌, కామారెడ్డి, నిర్మల్‌-ఆదిలాబాద్ మీదుగా సాగే NH-44పైన జంట న‌గ‌రాల్లో విప‌రీత‌మైన వాహ‌న ర‌ద్దీతో న‌గ‌రవాసులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలకు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో ర‌హ‌దారి విస్తర‌ణ‌, ఎలివేటెడ్ కారిడార్‌కు కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణశాఖ నిబంధ‌న‌లు ఆటంకంగా మారాయి.

Elevated Corridor in From Paradise Junction :మ‌ల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. ఇటీవ‌ల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యత‌లు స్వీకరించగా ఆ వెంటనే కంటోన్మెంట్‌ భూముల అప్పగింతపై కేంద్రానికి విన్నవించారు. జనవరి 5న దిల్లీలో ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Defense Minister Rajnath Singh)ను సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు.

కేంద్ర మంత్రితో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్ ప్రాంతంలో ర‌హ‌దారుల విస్తర‌ణ‌కు ర‌క్షణ శాఖ భూములు అప్పగించాల‌ని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. వెంటనే స్పందించిన ర‌క్షణశాఖ ఈ మేరకు అంగీకారం తెలియజేస్తూ, మార్చి ఒక‌టో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంట‌నే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది.

హైదరాబాద్‌లో ప్రతి గల్లీ అభివృద్ధి మా ప్రభుత్వం బాధ్యతే : సీఎం రేవంత్​

44వ జాతీయ రహదారిపై సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ (Paradise in Secunderabad) జంక్షన్ నుంచి మొద‌లు కానున్న కారిడార్‌.... తాడ్‌బండ్ జంక్షన్‌, బోయిన‌ప‌ల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వ‌ద్ద ముగుస్తుంది. 15వందల 80కోట్ల రూపాయల వ్యయంతో 5.320 కిలోమీట‌ర్ల కారిడార్‌ నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీట‌ర్లు, అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్ 0.6 కిలో మీటర్లు ఉంటుంది.

మొత్తం 131 స్తంభాలతో 6 వ‌రుస‌ల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా బోయిన‌ప‌ల్లి జంక్షన్ స‌మీపంలో ఇరువైపులా ర్యాంపులు నిర్మించనున్నారు. ఇది పూర్తైన త‌ర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. ఫ‌లితంగా ఆ మార్గంలో ప్రయాణం మ‌రింత క్షేమంగా, వేగంగా, సుఖ‌వంతంగా సాగ‌నుంది.

అటు ఎల్బీనగర్ ప్రాంతంలోని బైరామల్‌గూడ కూడలిలో నిర్మించిన రెండో స్థాయి పైవంతెనను సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. 148.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పైవంతెన శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి వైపు నుంచి BNరెడ్డి నగర్, నాగార్జునసాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ మీదుగా హయత్‌నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది. ఇదే కూడలిలో ప్రస్తుతం రెండు లూప్‌లు నిర్మాణంలో ఉండగా పైవంతెన నేటి నుంచి అందుబాటులోకి రాబోతుంది..

లోక్‌సభ ఎన్నికలు 2024 - నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే - బిజీబిజీగా గడపనున్న కేంద్రమంత్రి

Last Updated : Mar 9, 2024, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details