Fire Accident in Sangareddy Chemical Factory :తెలంగాణ రాష్ట్రంసంగారెడ్డి జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు సామాన్యుల ప్రాణాలను బలిగొంటున్నాయి. హత్నూర మండలంలోని ఓ కెమికల్ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో ఆయిల్ బాయిలర్ పేలడంతో(Boiler Explosion) ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం - ఐదుగురు మృతి టైలర్ షాప్‌లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి
ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌తో పాటు బిహార్‌కు చెందిన మరో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. అలానే పది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని సంగారెడ్డి, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 60 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇందులో దాదాపు 15 మంది పేలుడు సంభవించిన రియాక్టర్ వద్దే పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద స్థలిని మంత్రి కొండా సురేఖ, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యురాలు సునితా రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.
పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి : ఎస్బీ పరిశ్రమ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేలుడు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
BRS Leaders Response on Fire Accident :సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
సచివాలయం మూడో ఫ్లోర్లో మంటలు- కీలక దస్త్రాలు దగ్ధం!