Nirmala Sitharaman Comments On Telangana :కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయట్లేదని తెలిపారు. బడ్జెట్‌కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తున్నామని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులకు వివరణ ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నామని, పీఎం గతిశక్తి ద్వారా రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ అప్పులపై కేంద్రమంత్రి ఆందోళన : బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నామనడం సరికాదన్న నిర్మలా సీతారామన్, తన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా తెలంగాణకు నిధుల కేటాయింపులను ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవమని, ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుల్లో కూరుకుపోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
విభజన హామీల కింద తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు రూ.2,700 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. అయినా కూడా మెదక్ జిల్లాలో మొదటి రైల్వేస్టేషన్‌ను మోదీ సర్కారే ఇచ్చిందన్నారు.
"రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఉంది. ఈ రోజు అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవం.కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోంది. అప్పుల విషయంలో ఏ పార్టీని నిందించట్లేదు. తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు మంజూరు చేశాం.మెదక్ జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ నోడల్ పాయింట్ ఇచ్చాం" -నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి