తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ కొత్త చిహ్నంపై అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం - సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ - DISCUSSION ON TS EMBLEM IN ASSEMBLY

CM Revanth On Telangana New Emblem: రాష్ట్ర అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు లేకుండా అందరి సూచనలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 7:40 AM IST

Telangana New Emblem Release Updates
Telangana New Emblem Release Updates (ETV Bharat)

Telangana New Emblem Release Updates : తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టంచేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు. సీఎం సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. సీపీఐ, సీపీఎం నాయకులతోపాటు కోదండరాం, తెలంగాణ జేఏసీ నేతలు వాటిని పరిశీలించారు.

Telangana State New Logo : నూతన చిహ్నంలో రాచరిక గుర్తులు లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ప్రచారంలో ఉంది. అయితే కాకతీయ తోరణం, చార్మినార్‌లు కొత్త చిహ్నంలో లేకుండా రూపొందిస్తున్నారనే ప్రచారం జరిగింది. గురువారం సచివాలయంలో మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తదితరులతో సమావేశమైనప్పుడు కూడా అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై అనేక సూచనలు వచ్చాయని, దీనిపై ఇంకా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకొంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించి తుది రూపమేమీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదని, నమూనాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.

కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

TG Formation Day Celebrations 2024 :మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం నుంచి రాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం అమరవీరులకు నివాళులతో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు రాత్రి ట్యాంక్ బండ్​పై బాణాసంచా కాల్చడంతో ముగియనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల షెడ్యూల్

  • జూన్ 2న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్‌పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారు
  • ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న కార్యక్రమంలో సీఎం హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు
  • అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి
  • అదే వేదికపై జయ జయహే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేయనున్నారు
  • ఈ వేడుకల్లో సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు
  • పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు
  • సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలు జరుగుతాయి

తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం - జూన్​ 2న జాతికి అంకితం : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth review on TG Anthem

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రండి - కేసీఆర్‌కు సీఎం రేవంత్​ రెడ్డి ఆహ్వానం - TG Formation Day Invite to KCR

ABOUT THE AUTHOR

...view details