RGV Seeking Time For Investigation in Social Media Case :సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. అప్పటి టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో వర్మ పోస్టులు పెట్టారంటూ ఆయనపై ఏపీలోని మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రాంగోపాల్ వర్మను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేడు ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన గైర్హాజరయ్యారు. ఈ విషయంపై మద్దిపాడు పోలీసులకు వర్మ వాట్సప్ మెసేజ్ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు 4 రోజుల సమయం కావాలని అందులో కోరినట్లు సమాచారం.
వారం రోజుల క్రితం (నవంబర్ 13న) ఎస్సై శివ రామయ్య ఆధ్వర్యంలోని పోలీసుల బృందం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామ్ గోపాల్‌వర్మ ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ఆర్జీవీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టి వేయాలని కోరారు. నవంబర్ 19న విచారణకు హాజరు కావాలంటూ మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారని వర్మ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.