Film Celebrities Paid Tribute to Ramoji Rao : "అంధకారంలో మగ్గిన ఎన్నో జీవితాల్లో ఆ ఆలోచనాసమాహారం వెలుగులు నింపింది. మట్టిలో మాణిక్యాలెన్నింటినో ఉన్నత శిఖరాలకు చేర్చింది. రాజ్యాన్ని ఏలే రాజకీయరంగమైనా, తారలు తళుక్కుమనే వినోద ప్రపంచమైనా, ప్రశ్నించే గొంతుకల పాత్రికేయలోకంలోనైనా ఎంతో మందిని నూతన శిఖరాలకు చేర్చిన మహాయోధుడు రామోజీ."
ఆయన మరణవార్త విన్న సినీలోకం శోకసంద్రంలో మునిగింది. ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహం వద్ద చేరి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నరేశ్, కల్యాణ్‌రామ్, సాయికుమార్, గోపీచంద్, శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, గీత రచయిత చంద్రబోస్, గాయకుడు ఎస్పీ చరణ్ తదితరులు నివాళులర్పించారు.
తెలుగు వార్తా రంగంలో, వినోదరంగంలో ఆయన ఎనలేని కృషి చేశారని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. ఆయన స్థాపించిన టీవీ ఛానల్ ఎన్నో భాషల్లో విస్తరించాయని, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సేవలు అందించారని స్మరించుకున్నారు. ఎంతోమంది కొత్త వారిని సినీరంగానికి పరిచయం చేసిన ఘనతే ఆయనకే చెందుతుందని పలువురు సినీ తారలు శ్లాఘించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమని, ఆయన చేసిన సేవలు ప్రతీ భారతీయుడి మదిలో ఎప్పటికీ గుర్తుంటాయని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Rajendra Prasad Pays Tribute to Ramoji Rao :రాబోయే తరాలకు రామోజీరావు ఒక మార్గదర్శి అని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన, రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని కన్నీటిపర్యంతమయ్యారు.