FedEx Parcel Cyber Crimes in Telangana :ఫెడెక్స్ స్కాం ఏంటి అని చూస్తే మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు. మీ పార్శిల్‌లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదకద్రవ్యాలు లేదా నకిలీ పాస్‌పోర్టులు లేదంటే నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురిచేస్తారు. తర్వాత మీ గురించి ముంబయి సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుంచి ముంబయి సైబర్ క్రైమ్ నుంచి ఉన్నతస్థాయి అధికారిగా మాట్లాడి, భయాందోళనకు గురిచేస్తారు.
స్కైప్ లాంటి యాప్‌లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి, మీపై కేసు నమోదైంది. అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి, అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఎలాంటి నేరాలు జరిగిన మొదటి గంటలో 1930కి ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని, మీ నగదు మీకు చేరుతోందని పోలీసులతో పాటు బాధితులు సైతం తమ అనుభవాల్ని చెబుతున్నారు.
మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ : ఇటీవల ఈ కేసులు నగరంలో పెరిగిపోయాయి. నగరంలోని బాధితుల్లో 27 శాతం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. పోలీసులు పేరిట ఇలాంటి కాల్స్ రావడంతో పరువు పోతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ డబ్బు చెల్లిస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు 10 రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. తన బుక్ చేసిన పార్శిల్‌లో 5 పాస్‌పోర్టులు, 3 క్రెడిట్ కార్డులు,1 జత షూలతో పాటు 200 గ్రాముల ఎమ్‌డీఎంఏ డ్రగ్ ఉన్నట్లు తెలిపారు.
"మీకు ఇలాంటి కాల్స్ వస్తే లాజిక్‌గా ఆలోచించాలి. మీరు పార్శిల్ పంపలేదు కాబట్టి భయపడే అవసరం లేదు. కాల్ రాగానే పోలీసులకు చెప్పండి. లేదంటే 1930కి కాల్ చేసి చెప్పిండి. చాలా మంది వారు ఏం అడగకముందుకే డబ్బులు కట్టేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి చేశానా లేదా అని. అప్పుడే మీకు సమాధానం దొరుకుతుంది." - సజ్జనార్, సీనియర్ ఐపీఎస్ అధికారి
ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామంటూ కాల్ కట్ చేశారు. తర్వాత ముంబయి క్రైమ్ బ్రాంచ్ అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో బాధితుడు పూర్తిగా భయపడిపోయాడు. తన ఆధార్ అక్రమ కార్యకలపాలకు వాడుతున్నట్లు బెదిరించడంతో ఖంగుతున్నాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 3 లక్షల 71 వేల 581 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.