Farmers Suicides in YSRCP Regime: దేశంలోనే మూడో స్థానం ఇది వినడానికి బాగున్నా ఏ విభాగంలో వచ్చిందో తెలిస్తే గుండెలు తరుక్కుపోతాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన స్థానమిది. అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారిన పరిస్థితి. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రైతుల జీవితాలను అల్లకల్లోలమయ్యాయి.
గిట్టుబాటు ధర ఏది జగనన్నా - నిమ్మరైతుల ఆవేదన - Lemon Farmer Problems in AP
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగసకల్లుకు చెందిన జయరాముడు కుటుంబానికి ఉమ్మడిగా ఆరు ఎకరాల పొలముంది. మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, ఆముదం వేసేవారు. బ్యాంకు నుంచి రూ.5.90 లక్షలు, ప్రైవేటుగా రూ.4 లక్షలు అప్పుగా తెచ్చి 14 బోర్లు వేయించినా అరకొర నీళ్లే వచ్చాయి. దాంతో ఏడు సంవత్సరాలపాటు నష్టాలే మిగిలాయి. సొసైటీ అధికారులు నోటీసు పంపడంతో పొలం వేలానికి పోతుందనే ఆవేదనతో జయరాముడు తొమ్మిది నెలల కిందట ఉరేసుకున్నారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమార్తెలున్నారు. అయిదుగురికి వివాహాలు చేయగా చిన్న కూతురు పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసైనా చదువు మాన్పించారు. కాలేజీకి పంపాల్సిన బిడ్డను కూలీ పనులకు తీసుకెళ్తున్నానని ఆ తల్లి కన్నీరు పెట్టుకున్నారు.
వైసీపీ పాలనలో రైతులకు మిగిలింది కన్నీళ్లే: వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు, కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ పాలనలోనే దాపురించింది. మిరప రైతులకు నష్టం నషాళానికి అంటింది. పత్తి రైతులు తెల్లబోయారు. ఉద్యాన రైతులైతే జగన్ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టాలను బరించి వ్యవసాయం చేస్తున్నా కాలం మాత్రం కరుణించడం లేదు. ఏడాదిలో రెండు, మూడు సార్లు పంటల మునిగిపోవడం ఆపై కరవు కాటకాలు. రూ.లక్షల్లో పెరుగుతున్న అప్పులు, వాటిపై వడ్డీల్ని తలచుకుని రైతు కుటుంబాలకు అన్నం సయించడం లేదు. ఇదిగో ఈ ఏడాది కలిసొస్తుందేమో అంటూ ఆశల సేద్యం చేసి చేసి అలసిపోతున్నారు. నిస్సహాయ స్థితిలో నమ్ముకున్న పొలంలోనే కొందరు నిర్జీవులవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సగటున 1,100 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.7 లక్షలు ఇస్తామనే హామీనీ సక్రమంగా అమలు చేయడం లేదు.
మరణించిన రైతు కుటుంబాలకు సహాయం అందేదెప్పుడు?
మాది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం. ఆర్‌బీకేల ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనంతగా రైతు భరోసా ద్వారా పెట్టుబడిలో 80% మేమే ఇస్తున్నాం. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా మారింది. మా ఏలుబడిలో వ్యవసాయం సుసంపన్నంగా ఉందంటూ సీఎం జగన్ కొన్ని వందల సార్లు బాకాలు ఊదారు. ఎన్నికల ప్రచారంలోనూ పదేపదే అదే మాట చెబుతున్నారు. రాయలసీమలో ఎండిన పంటల సంగతేంటి. డెల్టాలో ధర దక్కని వరి రైతు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో సాగెందుకు తగ్గుతోంది. ఉత్పత్తి ఎందుకు పడిపోతోందో పెట్టుబడిలో 80% ఇస్తుంటే ఏ రైతును కదిలించినా రూ.లక్షల్లో అప్పులయ్యాయని ఎందుకు కన్నీరు పెడుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉరికొయ్యకు రైతులు ఎందుకు వేలాడుతున్నారు. ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే వృత్తినే ఎందుకు వదిలేస్తున్నారు. కరవుతో అల్లాడుతున్న రైతుల కష్టాలను పరిశీలించడానికి మనసు రాని ఈ పాలకుడికి, తుపానుతో నష్టపోయిన పంటలను చూడడానికి కార్పెట్ వేయించుకున్న ఈ సీఎంకు అసలు వ్యవసాయమంటే ఏంటో తెలిస్తేగదా.
రుణాలు తీర్చలేక, సాగు చేయలేక రైతన్నల బలవన్మరణాలు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని గ్రాంటు నుంచి ఏకంగా 15 రైతు కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేసి కొందరు, తల్లిదండ్రులను ఇంటి వద్దనే ఉంచేసి మరికొందరు పొట్టచేత పట్టుకుని, పుట్టిన గడ్డను, సొంతూరిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పులను తీర్చడానికే అక్కడ కూలి పనులు చేస్తుండటం గమనార్హం. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారిలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటకల తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)- 2022 నివేదిక ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. ఏపీలో 2022 సంవత్సరంలో 917 మంది రైతులు, కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 309 మంది సొంత భూములున్న పట్టాదారులు, 60 మంది కౌలుదారులు ఉన్నారు. మిగిలిన వారంతా రైతు కూలీలు. అంటే జగన్ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.