ఖరీఫ్ సీజన్‌పైనే రైతుల ఆశలు - ఈసారైనా పంటలు బాగా పండాలని ఆకాంక్ష (ETV Bharat) Farmers Started Farming in Kharif Season :నల్గొండ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ కొత్తకళ సంతరించుకుంటోంది. గత ఏడాది ప్రతికూల పరిస్థితులు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు సవాల్ విసరగా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం సాగుకు అనువైన భూమి ఆరు లక్షల ఎకరాలున్నట్లు గుర్తించారు. అందులో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 4 లక్షల 50 వేల ఎకరాల్లో సాగవుతాయని అంచనా.
ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇప్పటికే అందుబాటులో ఉంచారు. జూన్ మెుదటి నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో అన్నదాతలు తమ పంట పొలాలు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు విత్తడం ప్రారంభించారు. జూన్ మెుదటి నుంచే వర్షాలు కురవడంతో పంటపొలాల్ని దున్ని సాగుకు సిద్ధం చేసినట్లు అన్నదాతలు చెబుతున్నారు.
'గతేడాది కంటే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. మృగశిర కార్తె సమయంలో వర్షాలు బాగా పడి భూములు నానాయి. దీంతో ఈసారి పత్తిగింజలు వేస్తున్నాం. ముందే వర్షాలు పడటంతో రైతులందరూ సాగుకు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు కురుస్తాయని పత్తి సాగు చేస్తున్నాం'-రైతులు
ఖరీఫ్ సాగుపైనే రైతుల ఆశలు :గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్నాయని, అందుకే ముందుగానే విత్తనాలు నాటి సాగుకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పడుతున్న వర్షాలతో పాటు మరో రెండు మూడు రోజులు వర్షాలు పడితే పత్తి సాగుకు ఢోకా ఉండదని చెబుతున్నారు. యాసంగి సాగుకు సాగునీరు లేక ఇబ్బందులు పడిన రైతులు, ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా పంటలు బాగా పండుతాయని ఆకాంక్షిస్తున్నారు.
'గత సంవత్సరంలో వర్షాలు తక్కువగా కురిశాయి. వ్యవసాయ పంటలు ఎండిపోయాయి. దీని వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం. ప్రస్తుతం వర్షాలు ముందే కురుస్తున్నాయి. గత మూడు రోజులు వర్షం పడినట్లు మళ్లీ రెండ్రోజులు కురిస్తే చెరువులో నీళ్లు ఉంటాయి, బోర్లు ఉపయోగపడతాయి. చాలా మంది పత్తిసాగు చేస్తున్నారు. మళ్లీ వర్షాలు పడితే అందరూ సాగు చేస్తారు'-రైతులు
తెల్లబంగారం సాగుకు సిద్ధమైన అన్నదాతలు - విత్తనాల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి - COTTON CROP CULTIVATION IN TELANGANA
రాష్ట్రంలో మొదలైన వానాకాల కోలాహలం - పంటల ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ - Kharif Season Start in Telangana