Farmers Crop Loan Waiver Today in Telangana : రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. లక్ష రూపాయల వరకు రుణబకాయిలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో 7వేల కోట్ల రూపాయలు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులతో రైతువేదికల వద్ద సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రుణమాఫీ వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
రైతుల పంట రుణమాఫీ నేటి నుంచి మొదలు కానుంది. ఇవాళ లక్ష రూపాయల వరకు అప్పులు మాఫీ కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు సుమారు పదకొండున్నర లక్షల రైతుల రుణఖాతాల్లో దాదాపు 7వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది. భూమి పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి - రేపు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి : సీఎం రేవంత్ - congress Meeting at Praja Bhavan
రుణ బకాయిలున్న సుమారు 6 లక్షలా 36 వేల మంది రైతులకు రేషన్ కార్డులు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. రేషన్‌కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రుణమాఫీ సందర్భంగా సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల వద్ద లబ్ధిదారుల సంబరాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 500 రైతువేదికల వద్ద ఉండే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని సుమారు 39వేల మంది రైతుకుటుంబాల రుణమాఫీ కోసం మొత్తం 31 వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. లక్ష రూపాయల వరకు రుణమాఫీ కోసం బాండ్ల విక్రయం ద్వారా 4వేల కోట్లు.. ఇతర మార్గాల్లో మరో 5వేల కోట్ల రూపాయల వరకు నిధులను ప్రభుత్వం సమీకరించింది. లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీ కోసం సుమారు 8వేల కోట్ల రూపాయలు... మిగిలిన రుణాల మాఫీకి మరో 15 వేల కోట్ల రూపాయలు వరకు అవసరమవుతుంది.
స్వల్పకాలిక పంటల సాగు కోసం 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. కుటుంబానికి అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా 2 లక్షల రూపాయల వరకు రుణబకాయిలను రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెలకు లక్ష రూపాయల జీతం, ఆదాయం ఉన్న సుమారు 17 వేల మందికి రుణమాఫీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా, గందరగోళం తలెత్తకుండా బ్యాంకులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే ప్రతీ బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించారు. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లో జమ అయితే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మొదటి దఫా రైతు రుణమాఫీకి సిద్ధం - మరో రూ.15వేల కోట్ల నిధుల కోసం వేట - Crop Loan Waiver In Telangana