A Forest Created By Satyanarayana on Seventy Acres : ప్రకృతి ప్రేమికుడు తనకున్న 70 ఎకరాల క్షేత్రంలో ఏకంగా వనాన్ని సృష్టించి గవర్నర్ ప్రతిభా పురష్కారం 2024కు ఎంపికయ్యారు. పర్యావరణం కోసం అడవిని సృష్టించి ఆదర్శనీయుడిగా నిలిచి ఆ రంగంలో విశిష్ట సేవలందించింనందుకు ఆయనను ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయననే సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన దుశర్ల సత్యనారాయణ.
70 ఎకరాల్లో అడవిని సృష్టించిన రైతు : ప్రకృతి మనకు ఇంత ఇస్తుంటే కొంతైనా తిరిగి ఇవ్వాలనుకుని చిన్నప్పటి నుంచి గట్టిగా భావించాడు. ఆ తర్వాత ఉద్యోగం వదులుకొని మరీ పంటలు పండే భూమిలో అడవిని సృష్టించారు. పశుపక్ష్యాదుల కోసం నీటి కొలనులనూ నిర్మించారు. ఆ అడవిలో పండిన కాయలు, పూసిన పువ్వులు అందులో ఉండే జంతువులకే సొంతం అంటున్నారు. ఈ అడవికి వారే యజమానులని, తాను వాటికి పనిచేసే నౌకరునని చెపుతున్నారు. అక్కడ నేలవాలిన ప్రతికొమ్మా అదే నేలలో కలిసిపోవాలి తప్ప ఎవరినీ ముట్టుకోనీయరు.
నదీ జలాల వాటా కోసం ఉద్యమం : పర్యావరణ పరిరక్షణ కోసం అంతటి మహాయజ్ఞం చేస్తున్న ఈయన గతంలో నదీ జలాల వాటా కోసం ఉద్యమించారు. 1980లో సాగు జలాల కోసం మొదలుపెట్టిన జలసాధన సమితి ఉద్యమం 1986లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ బాధితుల కోసం ఉద్ధృతమైంది. ఈ ఉద్యమాన్ని ఎంతలా ముందుకు తీసుకెళ్లారంటే 1996లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు జిల్లా నుంచి 481 మందిని పోటీలో నిలవడంతో దేశంలోనే అతిపెద్ద బ్యాలెట్గా అప్పట్లో సంచలనం సృష్టించింది.