Fake Votes in Tirupati :ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓట్ల అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా అత్యంత సంక్లిష్టంగా మారిపోయింది. ఇప్పటికే బోగస్ ఎపిక్ గుర్తింపు కార్డుల వ్యవహారంలో తిరుపతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వెలుగు చూస్తుండగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాల్లో వెలుగుచూస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ బూతు స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేసి 12 వేల 74 మంది గైర్హాజరి ఓటర్లుగా గుర్తించారు. వీరిలో 7 వేల 960 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు లెక్క తేల్చారు. ఇలాంటి వాటిని జాబితా నుంచి తొలగించాల్సి ఉన్నా తుది జాబితాలో కొనసాగించారు.
సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు
Fake Votes in Final Voter List :చంద్రగిరి నియోజకవర్గం తనపల్లెలోని 314వ పోలింగ్ కేంద్రంలో 597 ఓటర్లు ఉండగా 54 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు ఉన్నారు. పద్మావతిపురం ప్రాథమిక పాఠశాల పోలింగ్కేంద్రంలో ఇంటి నంబర్ల స్థానంలో పద్మావతిపురం అని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లు కొనసాగుతుండగా మరికొన్ని చోట్ల మృతులు, డబ్లింగ్ ఓటరు పేర్లను తొలగించలేదు. 301 పోలింగ్ కేంద్రంలో 36 ఓటర్ల వద్ద ఇంటి నెంబరును ఏకంగా వేదాంతపురం పేరుతో జాబితాలో చేర్చారు. 13 వందల 61 ఓట్లు ఉన్న 301 పోలింగ్ కేంద్రంలో దాదాపు 40 ఓటర్ల ఇంటి నెంబర్ల వద్ద వీధి పేర్లను జాబితాలో పొందుపర్చారు.