Fake Currency Notes in Nirmal District :నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భైంసాలో, ఖానాపూర్ పట్టణంలో, తాజాగా జిల్లా కేంద్రంలోనూ దొంగ నోట్లు బయటపడ్డాయి. దీంతో వినియోగదారుల్లో, వ్యాపారస్థుల్లో ఆందోళన మొదలైంది.
అచ్చుగుద్దినట్లు కలర్ జిరాక్స్ :నకిలీ నోట్లను స్థానికంగా ముద్రిస్తున్నారో, లేక వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ వాటిని చెలామణి చేస్తున్నారో అనే విషయంలో పూర్తి స్పష్టత లేదు. కానీ దొంగ నోట్లు చెలామణి మాత్రం కొనసాగుతోందనే విషయం నిర్ధారణ అవుతోంది. వాస్తవమైన నోట్లను ప్రతిబింబించేలా మందంగా ఉన్న కాగితాన్ని ఉపయోగిస్తూ కలర్ జిరాక్స్ చేసి నోట్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో తాజాగా జరిగిన ఘటనలో రెండు రూ.200 నోట్లు దొరికాయి. రెండింటిపైనా ఒకటే నంబరు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్న నోట్లు (రూ.200, రూ.100) అయితే సులభంగా మార్చేయవచ్చన్న ఆలోచనతో వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్‌లో చెలామణి అవుతున్న నకిలీ రూ.200 నోట్లు (ETV Bharat) మహిళలు, వృద్ధులు వారి లక్ష్యం :నోట్లను చూడగానే గుర్తు పట్టేవారు కాకుండా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది కూడా రద్దీ ప్రదేశాల్లోనే. దీంతో నోట్లు మార్చుకొని సులభంగా, వేగంగా అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది. బేరసారాలకు తావు లేకుండా వ్యాపారస్థులు అడిగిన రేటుకే వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మోసపోయిన వృద్ధుడు :జనవరి 8న జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్‌లో ఓ వ్యక్తి నువ్వులు కొనుగోలు చేశాడు. నువ్వులు అమ్మిన వృద్ధుడికి రూ.200 నోట్లు రెండు ఇచ్చాడు. దీంతో ఆ వృద్ధుడు మోసపోవడంతో పాటు నష్టపోయాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట్ వాసి పోశెట్టి జిల్లాకేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో కాయగూరల విక్రయానికి ఎప్పట్లాగే బుధవారం వచ్చారు. వాటితో పాటు నువ్వులు కూడా అమ్మకానికి ఉంచారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి దాదాపు మూడు కిలోల నువ్వులు కొనుగోలు చేసి రూ.400 (రూ.200 నోట్లు రెండు) ఇచ్చి వెళ్లాడు. కొంతసేపయ్యాక మరో వినియోగదారుడికి ఆ నోట్లు ఇవ్వబోయాడా వృద్ధుడు. గమనించిన వ్యక్తి అవి నకిలీవని గుర్తించాడు. అతడిచ్చినవి నిజం నోట్లు కావని, కలర్ జిరాక్స్ చేసిన కాగితాలని చెప్పడంతో ఖిన్నుడయ్యాడు. వెంటనే అప్రమత్తమై నిందితుడి కోసం చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేంలేక మిన్నకుండిపోయాడు.
బాధితుడు పోశెట్టి (ETV Bharat) బెట్టింగ్ దందాలోనూ నకలీ నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు : జిల్లాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు డబ్బులు చెలామణి చేసే క్రమంలో నకలీ నోట్లను సైతం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నిర్మల్ జిల్లాలో అక్కడక్కడా వెలుగు చూస్తున్న ఘటనలు దొంగ నోట్ల విషయాన్ని తెలియజేస్తున్నాయి.
రూ.10 లక్షలకు రూ.44 లక్షలు - నకిలీ నోట్ల గ్యాంగ్ ఆఫర్ - స్వాగతించి జైల్లో వేసిన పోలీసులు - Fake Notes Gang Arrest In Eluru