Happy World Laughter Day 2024 :అప్పట్లో నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కానీ ఇప్పుడు నవ్వు నలభై విధాల మేటి. నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం. నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో సినీ కవి. ఎలాంటి సమస్యనైనా చిన్న చిరునవ్వుతో దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి నవ్వు పట్ల నేటి తరానికి అవగాహన లేకపోవడంతో నిరంతరం ఘర్షణలు, తగాదాలతో కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు సమాజంలో భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులు, శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులు నవ్వుతో తమ సేవలు అందించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. నవ్వు గొప్పతనాన్ని వివరించేందుకు ఏటా అక్టోబరు మొదటి శుక్రవారం ‘ప్రపంచ చిరునవ్వు దినోత్సవం’ జరుపుతున్నారు.
నవ్వుతో చెప్తే మెదడులో పదిలంగా :ఏదైనా సమస్యతో ఉన్నవారిని చిన్న చిరునవ్వుతో పలకరిస్తే కొండంత అండ దొరికినట్లుగా భావిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,209 పాఠశాలలుండగా, వాటిలో 2,11,009 మంది విద్యార్థులున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జెక్టుల్లో వెనుకబడి ఉంటున్నారు. దీంతో వారు అందరితో కలిసేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వారి దృష్టి మరల్చి వారిలోంచి ఆ భావన తీసేందుకు ఆయా తరగతుల ఉపాధ్యాయులు చిరునవ్వుతో విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మెలిగితే వారి సమస్యలు దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. కోపంతో కాకుండా చిరునవ్వుతో విద్యార్థులకు పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులు చాలా ఉత్సాహంగా తరగతులు వింటారని, అవి వారి మెదడులో నిక్షిప్తం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
'లాఫింగ్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు- తీసుకోవాల్సిన జాగ్రత్తలు' - Laughter Yoga Health Benefits