ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూమ్‌మేట్స్‌కి గొడవలు వచ్చేది ఎక్కువగా ఆ విషయంలోనే - ఎందుకంటే! - ROOMMATES RELATION

రూమ్​మేట్స్​ అలవాట్లు, అభిరుచులు వేర్వేరు - నిపుణుల సలహాలు ఇవే

roommates_relation
roommates_relation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 12:08 PM IST

ROOMMATES RELATION :'మావా, బావా, ఏరా, పోరా' అనుకున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ, ఎక్కడైనా చెడిందా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే కొంత మంది స్నేహితులు విడిపోతుంటారు. డబ్బు విషయంలో, మాటలు దొర్లడం వల్లనో దూరమవుతుంటారు. దూరంగా ఉంటున్న వారైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఫోన్లు కూడా చేసుకోరు కానీ, అదే పరిస్థితి రూమ్​మేట్స్​ మధ్య వస్తే? ఒకే గదిలో కలిసి ఉంటూ మాట్లాడుకోని పరిస్థితి ఉంటే?!

జాబ్ కోసమో, ఉన్నత చదువుల కోసమో యువత నగర బాట పడుతోంది. ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలు వెంటబెట్టుకుని మారుమూల గ్రామాల యువతీ, యువకులు పట్టణాలు, నగరాలకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారంతా ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు కలిసి ప్రత్యేకంగా గదుల్ని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మరికొందరు పీజీ హాస్టళ్లలో గదిని షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూమ్​మేట్స్ మధ్య వాతావరణం బాగుంటేనే చదువులో ముందుకెళ్లొచ్చు. ఉద్యోగంలోనూ రాణించేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ, ఏ మాత్రం చెడినా అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రూమ్​మేట్స్​ కొన్ని రూల్స్ ఫాలో అయితే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

శంకర్ పొలిటికల్ గేమ్ ఛేంజర్ - 'ఎన్నో సీన్లకు కనెక్ట్ అవుతారు'

రూమ్‌మేట్‌తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా :

రూమ్‌మేట్‌తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా కొన్ని విషయాల్లో అప్పుడప్పుడూ భేదాభిప్రాయాలు వస్తుంటాయి. చిన్న చిన్న గొడవలు ఇద్దరి మధ్య దూరం పెంచుతాయి. ఇది భౌతికంగానే కాకుండా, మానసిక ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే రూమ్‌మేట్‌తో కలిసున్నప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

రూమ్​మేట్ ఫ్రెండ్ వస్తే!

కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా, గదిలో స్నేహితులతో కలిసి ఉంటున్నా ప్రతి ఒక్కరికీ ప్రైవసీ ముఖ్యం. ఈ క్రమంలో తమకంటూ కొంత ప్రత్యేక సమయం కేటాయించుకున్న సమయంలో వారికి భంగం కలిగించకుండా ఉంటే మంచిది. మీ రూమ్‌మేట్‌ స్నేహితుడు/ కొలీగ్‌ మీ గదికి వచ్చినపుడు అనవసరంగా వాళ్ల మాటల్లో తలదూర్చడం అస్సలు మంచిది కాదు. వాళ్ల మాటల మధ్య చర్చకు అంతరాయం కలిగించడం సరికాదు. వాళ్లను స్వేచ్ఛగా వదిలేసి మీ పని మీరు చేసుకోవడంతో పాటు మీకు వీలైతే వచ్చిన వారికి కాఫీ/టీ ఇచ్చినా తప్పు లేదు. ఓసారి మీరు ఇలా చేస్తే మీకు సంబంధించిన వాళ్లెవరైనా మీ గదికి వస్తే మీ రూమ్‌మేట్‌ కూడా మీకు సహాయపడే అవకాశాలు ఉంటాయి.

కలిసి పంచుకోవాలి!

చాలామంది రూమ్‌మేట్స్‌కి మనస్ఫర్థలు వచ్చేది ఎక్కువగా పనుల దగ్గరే! సమయం లేకనో, వీలు పడకనో ఒక్కోసారి ఒకరి పైనే ఆ భారం పడొచ్చు. అంత మాత్రం చేత ‘అన్నీ నేనే చేయాలా? అనే ఆలోచన మంచిది కాదు. తరచూ ఇలాగే జరుగుతుంటే వేరే విషయం. సాధ్యమైనంత వరకు గది శుభ్రం, వంట పనులన్నీ సమానంగా పంచుకుంటే మంచిది. అలాగే బయటి నుంచి తెచ్చుకునే సరుకులు, కాయగూరల విషయంలోనూ ఇదే పద్ధతి ఫాలో కావాలి. ఒకరు ఒకసారి, ఇంకొకరు ఇంకోసారి చేసేలా ప్లాన్‌ చేస్తే స్నేహం పెరుగుతుంది. ఒక్కోసారి పనిభారమంతా మీ రూమ్‌మేట్ పైనే పడినా మీరు ఎందుకు చేయలేకపోయారో అతడు/ఆమె అడగకముందే వివరణ ఇవ్వడంలో తప్పు లేదు. వాళ్లకి ఎపుడైనా వీలు కానపుడు పనుల భారం మీరు తీసుకుంటే ఏ గొడవా ఉండదు.

ఖర్చు సరిసమానంగా!

గది ఖర్చుల విషయంలో కొంతమంది రూమ్‌మేట్స్‌ ఎడమొహం పెడమొహంగా ఉంటుంటారు. మరి కొందరు ఏకంగా గొడవలే పెట్టుకుంటారు. నెలకు సరిపడా ఖర్చుల్లో హెచ్చుతగ్గులు సహజమే. కానీ, దానినే పట్టుకుని కూర్చుంటే ప్రశాంతత కొరవడుతుంది. వ్యక్తిగత అవసరాలు, ఖర్చులు ఎవరికి వారే పెట్టుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.

ఆ విషయంలో ఇబ్బంది పెట్టొద్దు!

రూమ్​మేట్స్​ అలవాట్లు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. ఈ విషయంలోనూ ఒకరినొకరు గౌరవించుకోకపోతే తిప్పలు తప్పవు. ఒకరికి ఆలస్యంగా నిద్ర పోయే అలవాటు, మరొకరు ఉదయాన్నే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే సెల్​ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తూ వారి నిద్రకు భంగం కలిగించొద్దు. బయటి ఫుడ్ ఆర్డర్‌ చేసే విషయంలో, ఫోన్లు వాడే విషయంలో ఎవరి సౌకర్యానికి వాళ్లను వదిలేయడం మంచిది.

ఒకవేళ గొడవైతే!

ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతగా సర్దుకుపోతున్నా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక విషయంలో రూమ్‌మేట్‌తో మనస్పర్థలు సహజమే. అలాగని పంతాలకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. స్నేహానికి ప్రాధాన్యమిస్తే అన్నీ సర్ధుకుపోతాయని గుర్తుంచుకోవాలి. కాస్త ఆలస్యమైనా సరే మీరు ఆ సమయంలో ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇస్తే నష్టమేమీ లేదు.

'గరికపాటిపై తప్పుడు ప్రచారం - వారిపై క్రిమినల్ కేసులు'

సంక్రాంతి సెలవులు ఏపీలోనే ఎక్కువ - విద్యార్థులకు పండగే

ABOUT THE AUTHOR

...view details