Excess Use of Antibiotics Can Lead to Asthma In Children :ఔషధ చికిత్సలో శక్తిమంతమైన అస్త్రం యాంటీబయాటిక్స్. వాటిని అవసరం లేకున్నా వినియోగిస్తే మాత్రం, అది కూడా పసి వయసులో వాడితే చిన్నారులు ఉబ్బసం (ఆస్తమా) బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతోంది, దాని ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉంటుందనే కోణంలో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేయగా, దానికి సంబంధిత పత్రం తాజాగా టీబీసీ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 2.60 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని జర్నల్‌లో పేర్కొన్నారు.
అధికంగా వాడితే పని చేయవు :5 సంవత్సరాల్లోపు చిన్నారులకు వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90 శాతం కారణం వైరస్‌లే. వీటి కారణంగా మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి, నాలుగైదు రోజుల తర్వాత దానంతటే తగ్గిపోతుంది. కాకపోతే కొందరు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అవగాహన లేని కొందరు వైద్యులు కూడా చిన్నారులకు యాంటీ బయాటిక్స్ ఇస్తుంటారు. ఇలా వాటితే నిరోధకత ఏర్పడి, పిల్లలకు భవిష్యత్తులో నిజంగా అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయవు. ఇలా వాడటం కారణంగానే ఒకప్పుడు టైఫాయిడ్‌కు బాగా పని చేసిన సిప్రోఫ్లోక్సాసిన్ ఇప్పుడు అస్సలు పని చేయడం లేదు.
చీటికీ మాటికీ యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
యాంటీబయాటిక్స్ వాడితే మంచి బ్యాక్టీరియాకు చెడు : పసి వయసులో ఉన్నప్పుడు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో తల్లిపాలు పట్టడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని అంటున్నారు. రోగ నిరోధక శక్తి చక్కగా పని చేయడానికి ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని వివరించారు. అయితే యాంటీ బయాటిక్స్ అధికంగా వాడటం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు కీడు జరుగుతోందని, రోగ నిరోధక శక్తిపై దుష్ప్రభావం పడుతోందని తెలిపారు. దీని ఫలితంగా ఆస్తమా ముప్పు పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో 12 ఏళ్లలోపు పిల్లల్లోని 7.9 శాతం మందికి ఆస్తమా ఉంటోంది. పిల్లలు, పెద్దలు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 46 శాతం భారత్ నుంచే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.