Ex MLA Shakeel Son Sahil Arrested Today : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న సాహిల్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు పోలీసుల నుంచి తప్పించుకుని దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడి కోసం అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా ఈరోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగానే విమానాశ్రయంలో సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Ex MLA Shakeel Son Sahil Remanded :అనంతరం సాహిల్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరుచారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతణ్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతను ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నాడు. గతేడాది జరిగిన పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్న అతను ఇంతకాలం పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
అరెస్ట్‌పై పోలీసుల ప్రకటన : సాహిల్ అరెస్ట్‌పై పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. 'గతేడాది డిసెంబర్‌లో సాహిల్ నిర్లక్ష్యంగా కారు నడిపారు. అతివేగంతో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. సాహిల్ పారిపోయి, వేరే డ్రైవర్ ప్రమాదం చేసినట్లు చిత్రీకరించారు. సాహిల్‌కు పోలీసులు సైతం సహకరించారు. సాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాం. ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాక సాహిల్‌ను అరెస్టు చేశాం. ఇదే కేసులో ఇద్దరు పోలీసులు సహా 15 మందిని అరెస్టు చేశాం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.' అని ఆ ప్రకటనలో వివరించారు.
కస్టడీకి కోరిన పోలీసులు : ఇదిలా ఉండగా సాహిల్‌ను కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 7 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సాహిల్ సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా, న్యాయమూర్తి తీర్పును ఈ నెల 10కి వాయిదా వేశారు.
ప్రమాదం నుంచి సాహిల్ అరెస్టు వరకు ఈ కేసులో ఏం జరిగిందంటే? :
- గతేడాది డిసెంబర్ 23వ తేదీన తెల్లవారుజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ప్రజాభవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ వద్ద ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఉన్నాడు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం అతణ్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా సాహిల్ పోలీసుల నుంచి పరారయ్యాడు.
- పంజాగుట్ట పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేశారు.
- దర్యాప్తులో ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. అలాగే స్టేషన్‌లోని కెమెరాల్లో సాహిల్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సాహిల్‌ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీ నిర్ధారించారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
- కేసులో ఏ1గా సాహిల్, ఏ2గా అబ్దుల్‌ను చేర్చారు. నిందితులను కోర్టులో హాజరుపరిచే సమయంలో సాహిల్ పేరు ఎఫ్ఐఆర్‌లో లేదని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అంతర్గత విచారణ తర్వాత సాహిల్ పేరును చేర్చినట్లు చెప్పారు. సాహిల్ పరారీలో ఉన్నాడని, మిగిలినవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని వివరించారు. సాహిల్ ముంబయి నుంచి దుబాయ్ వెళ్లాడని తెలిపారు. అతని కోసం లుక్ అవుట్ నోటిసు జారీ చేసినట్లు వెల్లడించారు.
ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు
- ఆ తర్వాత ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరఫు న్యాయవాది ఎలాంటి ఆధారాల్లేకుండా కేసు నమోదు చేశారని ఆరోపించారు. మరోవైపు పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయడానికి నిందితుడు అందుబాటులో లేరని, దుబాయ్‌లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జనవరి 17లోగా నిందితుడు దర్యాప్తు అధికారి ముందు హాజరై విచారణకు సహకరించారని ఆదేశాలివ్వబోగా సాహిల్ తరఫు న్యాయవాది పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
- మరోవైపు కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సాహిల్‌కు సహకరించిన ఇద్దరు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. సీఐ ప్రేమ్‌కుమార్, అనుచరుడు అబ్దుల్ వాసేలను బోధన్‌లో అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. షకీల్ కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అరెస్టు అయ్యారు. 13 మందిని నిందితులుగా చేర్చారు.
- పోలీసులు జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులపై సాహిల్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన హైకోర్టు 4వ తేదీన అతనిపై ఉన్న లుక్ అవుట్ నోటీసును సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 19లోపు పోలీసుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం సాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగా, పోలీసులు అతన్ని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు
షకీల్ కుమారుడు రాహిల్‌కు బిగుస్తున్న ఉచ్చు - పాత కేసు తిరగేస్తున్న పోలీసులు!