Harish rao Comments on Congress Govt :అబద్ధాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు ఒక్కొక్కటిగా గత ప్రభుత్వ పథకాలను ఎగబెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ప్రగల్బాలు పలికారు :కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే కల్యాణ లక్ష్మి చెక్కులు రాక 8 నెలలు అవుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు రూ.లక్ష, తులం బంగారం అని కాంగ్రెస్ నేతలు ప్రగల్బాలు పలికారని, తులం బంగారం దేవుడెరుగు, కనీసం కేసీఆర్ ఇచ్చే రూ.లక్ష కూడా ఎగ్గొడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
రైతుబంధు ఊసు లేదు :ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు సొమ్ము పెంపు ఉత్తమాటలేనని హరీశ్‌రావు దుయ్యబట్టారు. నేడు రూ.4 వేల పింఛన్ ఏమో కానీ, కేసీఆర్ ఇచ్చే రూ.2000 పింఛన్ రాక 2 నెలలు అయిందని, పింఛన్లు రాక ముసలోళ్లు గోస పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతు బంధు కేసీఆర్ పాలనలో రూ.5 వేలు ఇస్తుండే వారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా రూ.7500 ఇస్తామని గొప్పలు చెప్పిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.7500 ముచ్చట లేదని, ఇచ్చే రూ.5 వేల ఊసూ లేదన్నారు.