Ex DCP Radha Kishan Rao on KCR in Phone Tapping Case : రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినపుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో తెలిపారు.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్టు రాధాకిషన్‌రావు తెలిపారు. ఈ సమయంలోనే పైలెట్ రోహిత్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది. బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్, ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై : అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్‌లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్‌రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్‌ను కేసీఆర్‌కు పంపినట్టు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్‌ఫోర్స్ టీంను దిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్‌హౌస్‌లో అమర్చామని తెలిపారు.