తెలంగాణ

telangana

ETV Bharat / state

బీజేపీకి బ్రేక్ వేసేందుకే ఫోన్ ట్యాపింగ్ - రేవంత్‌, ఈటల, సంజయ్‌ సహా కొందరు బీఆర్ఎస్ నేతలపైనా నిఘా - TELANGANA PHONE TAPPING CASE UPDATE

Telangana Phone Tapping Case Updates : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన సంచలనం విషయాలు రాధాకిషన్‌రావు వాంగ్మూలం రూపంలో బయట పడ్డాయి. అసలు ఫోన్‌ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇందుకు అనుసరించిన వ్యూహమేంటి? దీన్ని ఎలా అమలు చేశారు? వంటి వివరాలన్నీ బయటపడ్డాయి. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీమంత్రి హరీశ్‌రావు పేర్లూ బహిర్గతమయ్యాయి.

Telangana Phone Tapping Case Updates
Telangana Phone Tapping Case Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 10:07 PM IST

Updated : May 28, 2024, 7:23 AM IST

మరో మలుపు తిరిగిన ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం (ETV Bharat)

Radha Kishan Rao Statement on Phone Tapping Case : సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రాధాకిషన్‌రావు పోలీసులకు తెలిపిన వాంగ్మూలంలో కీలక అంశాలు బయటపడ్డాయి. పోలీసులకు ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించిందన్న రాధాకిషన్‌రావు బీఆర్ఎస్ ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ విభాగానికి తమ సామాజిక వర్గానికే చెందిన నమ్మకమైన అధికారి కావాలని కేసీఆర్ కోరుకున్నారని వెల్లడించారు. ఆయన అభీష్టం, ప్రభాకర్‌రావు సూచన మేరకు తనను టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించారని తెలిపారు.

Telangana Phone Tapping Case Updates :కేసీఆర్ ఆలోచనలను అర్ధం చేసుకొని అప్పటి నుంచి ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు చక్కబెట్టడం మొదలుపెట్టానని రాధాకిషన్‌రావు వివరించారు. సివిల్ వివాదాల పరిష్కారంతోపాటు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకొనిరావడం, ఆదోళనలను అణచివేయడం వంటివి ఈ పనుల్లో ఉండేవని తెలిపారు. కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారనీ, ప్రతిపక్ష నాయకులను గమనిస్తూ ఉండేందుకు ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఆధ్వర్యంలో ఐజీ ప్రభాకర్‌రావు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారని వెల్లడించారు. అప్పటి నుంచి వారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టానని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.

వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం : వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్‌రావు ద్వారా తీసుకున్నట్లు రాధాకిషన్‌రావు తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన డబ్బు పట్టుకోవడం, బీఆర్ఎస్‌ పార్టీ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడటానికి ప్రణీత్‌రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించినట్లు వెల్లడించారు. 2018 ఎన్నికల ముందు మొదలైన ఈ పని 2019 లోక్‌సభ, ఆ తర్వాత ఉపఎన్నికలు, 2023 ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన అన్నారు.

సొంత పార్టీ నాయకుల ఫోన్ల పర్యవేక్షణ : తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, బీఆర్ఎస్‌కు ఆ పార్టీ నాయకులకు ముప్పుగా భావించే నేతలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రభాకర్‌రావు తరచుగా చర్చించేవారని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. వీటి ఆధారంగా ప్రణీత్‌రావు ఆయా నాయకులను ఫోన్‌ ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండేవారన్నారు. అనేక మంది సొంత పార్టీ నాయకులనూ పర్యవేక్షించినట్లు రాధాకిషన్‌రావు వివరించారు.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదిస్తున్న శంభీపూర్ రాజు, కడియం శ్రీహరితో రాజకీయ వైరం ఉన్న రాజయ్య, తాండూరు ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఆయన భార్య సమాచారాన్ని పర్యవేక్షించేవాళ్లమని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎన్‌టీవీ, ఏబీఎన్‌ ఛానళ్ల అధినేతలు నరేంద్రనాథ్ చౌదరి, రాధాకృష్ణలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.

అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన జానారెడ్డి కుమారుడు రఘువీర్, సరిత తిరుపతయ్య, కోరుట్లకు చెందిన జువ్వాది నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ ఉన్నారని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కార్యాలయ సిబ్బంది, ఈటల రాజేందర్‌, బండి సంజయ్, వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది వ్యాపారులు, స్థిరాస్థి సంస్థలను ఇలా పర్యవేక్షించారని చెప్పారు.

ఎస్‌ఐబీ తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందన్న భయంతో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయవాదులు, అధికారులు మామూలు ఫోన్లు వాడటం మానేసి వాట్సప్, సిగ్నల్, స్నాప్ చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టినట్టు రాధాకిషన్‌రావు వివరించారు. వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్‌ను గమనించేందుకు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, ఆయన బృందంలోని సభ్యులు ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్ సేకరించడం మొదలుపెట్టారని తెలిపారు. ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భంగా అక్టోబర్, నవంబర్‌లో ఐ న్యూస్‌కు చెందిన శ్రవణ్‌రావును అప్పటి మంత్రి హరీశ్‌రావు తరఫున ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును కలుస్తుండేవారని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.

బీజేపీని ఇరుకున పెట్టాలని భావించిన కేసీఆర్ : దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాల తర్వాత ఆ పార్టీకి బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో మునుగోడు ఉపఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాధాకిషన్‌రావు వివరించారు. కమలం పార్టీలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ప్రలోభ పెడుతున్నట్లు, 2022 అక్టోబరు చివర్లో కేసీఆర్‌కు తెలిసిందన్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆయనతోపాటు తేవాలని రోహిత్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం అందిందన్న ఆయన దీని ఆధారంగా భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని గత ముఖ్యమంత్రి భావించారని తెలిపారు.

KCR Plan for Phone Tapping :కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్‌రావు కొందరి సెల్‌ఫోన్లను ట్యాప్ చేసి, వారి సంభాషణలకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ రూపొందించి దాన్ని కేసీఆర్‌కు అందించారని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. ఈ ఆడియో క్లిప్ ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన నందు అనే వ్యక్తితోపాటు ఇద్దరు స్వామీజీలను మొయినాబాద్ దగ్గర్లోని అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌజ్‌కు రప్పించారున్నారు. స్పై కెమెరాలు అమర్చి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో పాల్గొనాలని గత ముఖ్యమంత్రి ఆదేశించారని రాధాకిషన్‌రావు వెల్లడించారు.

పని పూర్తి కాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం : బీజేపీ జాతీయ నాయకులు బీఎల్‌ సంతోష్‌ను అరెస్ట్ చేసి, తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న కమలం పార్టీ తమతో సయోధ్యకు వచ్చేలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని రాధాకిషన్‌రావు వివరించారు. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్‌ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్న ఆయన కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ అయిందని వివరించారు. అనుకున్నట్లు పని పూర్తికాకపోవడం వల్ల కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల డబ్బు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు అందాయని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. వీరిని ట్యాపింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు పేర్లు, వారి ఫోన్ నెంబర్లు పోలీసు కమిషనర్ ద్వారా అందేవన్న ఆయన, వారి ఫోన్లు ట్యాప్ చేసి మరింత సమాచారం సేకరించేందుకు ప్రణీత్‌రావు సాయం తీసుకునేవాడినని వివరించారు.

జి.వివేక్, రాజగోపాల్‌రెడ్డిల సహచరుల ఆర్థిక లావాదేవీలపై కన్నేసేందుకే ఎస్‌ఐబీకి వీరి పేర్లతో ఉన్న కాగితం పంపారని రాధాకిషన్‌రావు వివరించారు. ఈటల రాజేందర్‌ పీఏ జనార్ధన్‌కు సంబంధించిన సమాచారం ఆధారంగా భారతీయ విద్యాభవన్ దగ్గర రూ.90 లక్షలు స్వాధీనం చేసుకొని జుబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ఇలా పలువురి నేతలకు చెందిన డబ్బును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందుకు చాలామంది జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు సహకరించేవారని చెప్పారు. వారందరికీ కేసీఆర్‌ ఆశీస్సులు ఉంటాయని, మంచి పోస్టింగ్‌లు దక్కుతాయని చెప్పేవాళ్లమని రాధాకిషన్‌రావు వెల్లడించారు.

తీన్నార్ మల్లన్నపై ఫోకస్‌ :ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శస్తుండే తీన్మార్ మల్లన్నను 2021 ఆగస్ట్‌లో అరెస్ట్‌ చేశామని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. అయణ్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్‌రావును నాటి సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 2022లో ఎస్ఐబీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్‌ను విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టిన సైబరాబాద్ పరిధిలోని సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ పోలీసులు, సీసీఎస్ కలిసి సోదాలు నిర్వహించాయని రాధాకిషన్‌రావు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరించి, వారికి ఆటకం కలిగించే ఉద్దేశంతోనే చట్ట విరుద్ధంగా ఈ సోదాలు నిర్వహిచారని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయని రాధాకిషన్‌రావు వివరించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్‌రావు, తాను రాజీనామా చేశామని, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదై, అరెస్ట్ చేశాక రెండు ఫోన్లను అధికారులకు అప్పగించానని ఆయన వెల్లడించారు.

SIB EX DSP Praneeth Rao Case Update : ఒక ఫోన్‌లో సమాచారం మాత్రం చెరిపివేశానని, అందులో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, ఇతర అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో జరిపిన ఛాటింగులు ఉన్నాయని రాధాకిషన్‌రావు తెలిపారు. ఐఫోన్‌లో సమాచారాన్ని మాత్రం చెరిపివేయలేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో నాటి మంత్రి హరీశ్‌రావు పేరు వెల్లడించారు. ఐన్యూస్‌ ఎండీ శ్రవణ్‌రావును కలుస్తుండాలని, ఆయన ద్వారా అనేకమంది ఫోన్‌ నంబర్లు వస్తాయని ప్రభాకర్‌రావు ద్వారా హరీశ్‌రావు చెప్పించారని ప్రణీత్‌రావు వివరించారు.

రాధాకిషన్‌ రావు స్వామిభక్తి - 'ఇంతకంటే ఎక్కువ చెప్పలేను!' - Phone Tapping Case Updates

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ - ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు : బండి సంజయ్‌ - KCR Involvement in Phone Tapping

Last Updated : May 28, 2024, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details