Everything in the State is Pledged to Debt By Jagan : సంపద సృష్టి తెలియదు, ఉన్న రాబడి చాలదు, వనరులను పెంచి వాటి నుంచి ఆదాయం తెచ్చే నైపుణ్యం లేదు అలాంటివారు ఏం చేస్తారు? అప్పులు ఇచ్చే వారికోసం దిక్కులు చూస్తారు. మరి ఆదాయం లేనివారికి రుణం ఎవరు ఇస్తారు? ఇవ్వరు కాబట్టి అలాంటివారు ఏదో ఒకటి తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌ది అదే దుస్థితి. రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి అప్పులపైనే జగన్ ప్రధానంగా ఆధారపడ్డారు. తన ఐదేళ్ల పాలనాకాలంలో రుణం కోసం తోచిందల్లా తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలను బ్యాంకులకు కుదువబెట్టి రుణాలు తీసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌నే తాకట్టు పెట్టారు. ‘కార్పొరేషన్లకు మీరు ఇచ్చే అప్పుల కోసం నేను గ్యారంటీ ఉంటాను’ అంటూ ఏకంగా సర్కారే జీవోలను జారీ చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి జంకిన బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ‘మాకొద్దు మీ గ్యారంటీ భూములో, మరొకటో తాకట్టు పెట్టండి’ అని ముఖం మీదే చెప్పేశాయి. చేసేదేమీ లేక జగన్ సర్కారు ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. చివరికి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిని కూడా ఇప్పుడే కుదువ పెట్టేసింది. ఇంతకంటే దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రమేదైనా ఉంటుందా? భవిష్యత్తులో వచ్చే రాబడిని తాకట్టు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. జాదూ జగన్ చట్టాలు, నిబంధనలకు బలాదూర్ కదా? అందుకే అందినవి అందినట్టు తాకట్టు పెట్టి రూ.వేల కోట్ల రుణం తీసుకున్నారు. అలా తెచ్చిన రుణాన్ని ఆస్తులు సృష్టించే, ఆదాయం సాధించే, రాబడి పెంపొందించే మార్గాలపై వెచ్చించారా అంటే అదీ లేదు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వని ఖర్చులు చేశారు. ఈ పరిస్థితుల్లో తాకట్టు తాలూకు అప్పులు తీరేదెలా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వేచ్ఛావాయువులను పీల్చేదెప్పుడు?
కార్పొరేషన్లతో ఇష్టారాజ్యం: రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆ సంవత్సరం ఎంత ఉత్పత్తి ఉంటుందో అంచనా వేసి అందులో 3.5 శాతం మేర అప్పులు తీసుకునేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు ఇస్తుంది. ఆ పరిమితి దాటి అప్పులు చేయకూడదు. జగన్ సర్కారు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అప్పులు తీసుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ‘రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్’ను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సర్కారు రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు ఎత్తుగడ వేసింది. మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. అలా వచ్చే మొత్తంలో కొన్ని మద్యం డిపోల ఆదాయం ప్రతినెలా ఖజానాకు వచ్చి అక్కడి నుంచి కార్పొరేషన్‌కు మళ్లించేలా పథకం పన్నింది. తనకు వచ్చే ఆదాయం నుంచి కార్పొరేషన్ అప్పు తీరుస్తుందని పేర్కొని రూ.25 వేల కోట్లు కావాలని అడిగింది. పైగా ఆ అప్పు తీర్చేందుకు తాను గ్యారంటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు కూడా ఇచ్చింది. ఇంత చేసినా బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు భయపడ్డాయి. దీంతో విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. వాటి మార్కెట్ విలువ రూ.2,954,03,10,800గా పేర్కొంది. విశాఖ నగరంలోని 13 ఆస్తులకు చెందిన 128.70 ఎకరాలను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టింది. ఈ ప్రభుత్వ భూములను రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించారు.
పర్యాటక శాఖ పార్కు:విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన ఐదెకరాల్లో విస్తరించి ఉన్న టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్కును కూడా జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది. ఆహ్లాదకరమైన బెర్ము పార్కును హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.143 కోట్ల రుణం తీసుకుంది. రోజూ వందల మంది పర్యాటకులు లాంచీల్లో ఆ పార్కును సందర్శించి సేద తీరుతుంటారు. ఇందులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్‌ను కూడా నిర్వహిస్తున్నారు.