ETV Complaints on Fake Videos : ఎన్ని ఛానళ్లు పుట్టుకొచ్చినా, తెలుగు వారు ఈటీవీ (ETV) తెరపై చూస్తే తప్ప వార్తల్ని నమ్మరు. ప్రేక్షకుల్లో అంతటి విశ్వసనీయత సంపాదించుకున్న సంస్థ ఈటీవీ. ఇప్పుడు కొందరు మాయగాళ్లు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. ఏపీలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంటూ, ఈటీవీ స్క్రీన్‌ను పోలిన ఒక వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
ETV Complaints HYD Cyber crime : ఈటీవీతో పాటు ఏకంగా కేంద్ర నిఘా వ్యవస్థనూ బద్నాం చేసేందుకు బరి తెగించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ మేనిఫెస్టో రద్దు అని ఒకటి, చంద్రబాబు తీరుపై జనసేన ఆగ్రహం అంటూ మరొక వీడియోను ఈటీవీ ఏపీ లోగోతో పాటు, ఛానల్ తాజా సమాచారం ప్రసారం చేసే సమయంలో వాడే మ్యూజిక్‌తో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు.
ఈటీవీ పేరుతో వ్యాప్తి చేస్తున్న ఫేక్ వీడియోలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం, హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ (Cyber crime) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు వ్యాపింపజేసిన వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలు, ఐపీ అడ్రస్‌లు గుర్తించి ఆధారాలు అందజేసింది. ఛానల్ పేరును దుర్వినియోగం చేసిన వారిపై, కఠిన చర్యలు తీసుకోవాలని ఈటీవీ యాజమాన్యం పోలీసులను కోరింది.