Dilavarpur Ethanol Factory Issue :నిర్మల్ జిల్లాలోనిదిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి కేంద్ర పర్యావరణ శాఖకు విరుద్ధంగా గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం కేవలం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతినిస్తే, అప్పటి మంత్రివర్గం(కేసీఆర్ క్యాబినేట్) ఇతర ఇథనాల్ ఉత్పత్తులకు అనుమతిచ్చిందని పేర్కొంది. ప్రజాభిప్రాయ సేకరణ తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరించడంతో పాటు, స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోకుండానే పీఎంకే కంపెనీ ప్రహరీ గోడ నిర్మించినట్లు వెల్లడించింది.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీకి సంబంధించిన అనుమతుల వివరాలను రాష్ట్రప్రభుత్వం బయటపెట్టింది. ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని సంబంధిత దస్త్రాలను విడుదల చేసింది. ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే అనుమతి ఇస్తే, వాటిని గత ప్రభుత్వం పట్టించుకోకుండా తుంగలో తొక్కినట్లు పేర్కొంది. పర్యావరణశాఖ అనుమతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించి, నిబంధనలు పాటించలేదని వివరించింది.
ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్‌కు అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా అనుమతులు ఇచ్చానట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించిందని తెలిపింది. కంపెనీ స్వీయ ధ్రువీకరణ ఆధారంగా మినహాయింపు ఇచ్చారని పేర్కొంది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్‌వోసీ తప్పనిసరిగా తీసుకోవాలని, కానీ అలాంటిదేమి లేకుండా పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించిందని తెలిపింది.