Family Survey Akkineni Nagarjuna House :రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కుటుంబ వివరాలను సేకరించేందుకు ఇళ్లకు వెళితే వారు ఇచ్చే సమాధానాలతో అవాక్కు అవుతున్నారు. మా కుటుంబ సమాచారం మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటీ?, మేం రిచ్ పీపుల్.. మాలాంటి వారికి ఈ సర్వేలు కాదు, కుక్కలను ఎన్యూమరేటర్లపైకి విడిచిపెట్టడం, దుర్భాషలాడటం వంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సతీమణి చేసిన పనికి మాత్రం అందరూ హ్యాట్సాప్ చెప్పాల్సిందే. సాధారణ వ్యక్తిలా ఎన్యూమరేటర్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాచారం అందించడమే కాకుండా.. ఓ మెసెజ్‌ను సైతం ఇచ్చారు.
కుటుంబ వివరాలు తెలిపిన అక్కినేని అమల :రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 54లో ఉన్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటికి సర్వే ఎన్యూమరేటర్లు వెళ్లారు. అక్కడ వారికి అక్కినేని నాగార్జున భార్య అమల అన్ని వివరాలను వెల్లడించారు. సర్వేలే భాగంగా అడిగే 75 ప్రశ్నలతో కూడిన వివరాలను పరిశీలించారు. అనంతరం వారికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు.
రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కుటుంబ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అక్కినేని అమల తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరు సర్వేలో పాల్గొని అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వాలని సూచించారు. తాను కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ, అన్ని వివరాలు వెల్లడించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి గర్వం లేకుండా ఎన్యూమరేటర్లకు సహకరిస్తూ తన కుటుంబ వివరాలను చెప్పారు. ఈ సర్వేలో ఎన్యుమరేటర్ వినయ్ కుమార్, సూపర్వైజర్ శివకుమార్, సర్కిల్ మోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.