CMR College Students Protest Over Secret Filming in Hostel :మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో విద్యార్ధినుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల వసతి గృహంలో కొందరు సెల్‌ఫోన్‌లతో వీడియోలు చిత్రీకరిస్తున్నారని నిన్న రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు చిత్రీకరిస్తున్న సమయంలో కిటీకీలపై కొన్ని చేతి ముద్రలు ఉండడాన్ని గమనించిన విద్యార్థినులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.
బాత్రూం పక్కనే పనివాళ్ల గది :ఈ విషయంపై మాట్లాడిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పోలీసులు విద్యార్థినుల వసతి గృహాలను పరిశీలించిన వారు కొన్ని గదులు సిబ్బందికి అనుసంధానం చేసి ఉన్నాయని తెలిపారు. అలా ఉండడం వల్ల వీడియోలు తీయడానికి ఆస్కారం ఉందన్నారు. బాత్రూమ్ల వెంటిలేటర్లు ఇతర గదులకు అనుసంధానం చేసి ఉన్నాయన్నారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో వీడియోలు తీశారా, డిలీట్ చేశారా లేదా అన్నదానికి కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.
"ఫోన్లలో డిలీటెడ్ వీడియోలు ఉన్నా అనుమానితులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఉంది. మహిళల గదుల వెనక పనివాళ్లకు రూమ్లు పెట్టడం జరిగింది. అనుమానానికి ఆస్కారం ఉంది. ఇప్పటికైతే ఎలాంటి వీడియోలు లభించలేదు. గదుల వెంటిలెటర్స్ పనివాళ్లకు యాక్సెస్ ఉంది. స్వాధీనం చేసుకున్న ఫోన్లలో చెక్ చేయగా ఎందులో ఎలాంటి వీడియోలు లేవు." - శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ ఏసీపీ