ED Inquiry On Sheep Distribution Scam in Telangana : గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు కుంభకోణం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను తెలుసుకునేందుకు వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో బినామీ ఖాతాల్లోని లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసి వివరాలు సేకరిస్తుండటంతో ఈ లావాదేవీలే నిందితుల మెడకు ఉచ్చు బిగించనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఇప్పటివరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు 10 మంది నిందితుల్ని గుర్తించి 8 మంది పశుసంవర్ధకశాఖ అధికారులను అరెస్టు చేశారు. దారి మళ్లిన సొమ్ములో వీరు వాటాదారులు మాత్రమేనని దర్యాప్తులో తేలింది. మిగిలిన నగదు ఎవరి జేబులోకి వెళ్లిందని తేల్చడంపైనే ఈడీ దృష్టి సారించనుంది. ఇప్పటికే గొర్రెల కొనుగోలుకు ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనే సమాచారం సేకరించే పనిలో పడింది.
గొర్రెల పంపిణీ స్కామ్ అప్డేట్ - ఈడీకి సమాచారం ఇచ్చేందుకు ఆలస్యం
ED Inquiry on Sheep Distribution Scheme : గొర్రెల పంపిణీ పథకం కోసం అప్పటి ప్రభుత్వం రెండు విడతల్లో సుమారు రూ.11 వేల కోట్ల నిధుల్ని కేటాయించింది. ఆ సొమ్ము ఎవరెవరి ఖాతాల్లోకి చేరిందని ఆరా తీయడంలో ఈడీ నిమగ్నమైంది. ఈ స్కీమ్‌లో అనధికార ఏజెంట్లుగా వ్యవహరించిన మొహిదుద్దీన్ లాంటి దళారులు తమ బినామీల ఖాతాల్లోకి ఈ డబ్బును బదిలీ చేయించుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలుసుకున్నారు. ఈ వివరాలు ఇప్పుడు ఈడీ దర్యాప్తునకు కీలకం కానున్నాయి. బినామీల వాంగ్మూలాలు సేకరించడం ద్వారా మొహిదుద్దీన్‌తో పాటు మరికొందరు దళారులను గుర్తించి సూత్రధారుల గుట్టు రట్టు చేయాలని ఈడీ భావిస్తోంది.
Accused's statement Key Role in Sheep Distribution Scheme :అవినీతి నిరోధక శాఖ కేసులో కీలక నిందితులుగా ఉన్న మొహిదుద్దీన్, అతడి తనయుడు ఇక్రమ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసులో గత ప్రభుత్వంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా వ్యవహరించిన కల్యాణ్‌ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. మొహిదుద్దీన్ బినామీ ఖాతాలతో నగదు కొట్టేయగా దానిని తిరిగి కల్యాణ్ ద్వారా సూత్రధారులకు చేర్చి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈడీ దర్యాప్తులో వీరిద్దరి వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే కల్యాణ్‌ను కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు సంస్థలు విచారించాయి.
'గొర్రెల పంపిణీ'పై ఈడీకి వివరాలు ఇవ్వండి - జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర పంశు సంవర్ధక శాఖ లేఖ - SHEEP Distribution SCAM UPDATE