Encounter In Mulugu District :భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లా సరిహద్దుల్లో తాడ్వాయి మండలంలోని దామరతోగు అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ ఫైరింగ్ జరిగింది. పోలీసుల ఎన్కౌంటర్లో మావోయిస్టు అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని బుద్ధారం వాసి.
ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా మావోల లేఖ :దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్పై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఓ లేఖను విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని సంరక్షిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై మావోయిస్టు పార్టీ నిర్మూలనకై కాగర్ దాడిని తీవ్రతరం చేస్తున్నారన్నారు. అందుకే నిరంతరం పోలీసులతో అడవులను జల్లెడ పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలకోసం పనిచేస్తున్న విప్లవకారులను హత్య చేస్తుందని ఆజాద్ విమర్శించారు.