తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పాన్​ షాప్​కు వెళ్తే వెంటనే 'రిజిస్ట్రేషన్'​ - ఎంత ఎక్కువ చెల్లిస్తే అంత తొందరగా! - BRIBE TO ISSUE MARRIAGE CERTIFICATE

డబ్బులిస్తేనే కానీ వివాహ ధ్రువీకరణ పత్రాలు - ఏపీలోని ఏలూరు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నయా దందాకు తెర

Registrar Office Staff Issuing Marriage Certificates After Taking Bribes
Registrar Office Staff Issuing Marriage Certificates After Taking Bribes (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 6:45 PM IST

Registrar Office Staff Issuing Marriage Certificates After Taking Bribes : ఏపీలోని ఏలూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి అత్యవసరంగా మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సిబ్బందిని అడిగితే కార్యాలయం ఎదుట ఉన్న షాపులో ఉన్న వ్యక్తి ఫోన్‌ నంబరు ఇచ్చి ఆయనతో మాట్లాడమని చెప్పారు. తీరా అతని దగ్గరకు వెళ్లి చూస్తే 'రూ.5 వేలు ఇస్తే వెంటనే పని అయిపోతుంది' అని చెప్పడంతో వారు అవాక్కయ్యారు.

పాలకొల్లుకు చెందిన దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వారు విజయవాడలో నివాసం ఉంటున్నారు. సెప్టెంబరులో వచ్చిన వరదల్లో వారి పెళ్లి ఫొటోలు గల్లంతయ్యాయి. వీరికి అత్యవసరంగా వివాహ ధ్రువపత్రం అవసరమైంది. దీంతో పాలకొల్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ మధ్యవర్తిని కలిసి వారి సమస్య వివరించగా, ఫొటోలు లేకుండా సర్టిఫికెట్ కావాలంటే రూ.10 వేలు ఖర్చవుతుందని సిబ్బంది తెలపడంతో తల పట్టుకున్నారు.

రూ.500 దానికి రూ.5000 : ఉభయ జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌తో ఆగిపోలేదు ఇది. పెళ్లి రిజిస్ట్రేషన్‌కు సైతం భారీగా దోచుకుంటున్నారు. నేరుగా వెళ్లిన వారికి ఎక్కడా లేని నిబంధనలు చెప్పి వారిని మోసం చేస్తున్నారు. అన్ని సర్టిఫికెట్లు ఉండి రూ.500 చలానాకు మంజూరు చేయాల్సిన ధ్రువపత్రానికి, రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది మధ్యవర్తులతో కుమ్మక్కై దండుకుంటున్నారు. అన్ని పత్రాలుంటే ఒక రేటు, లేకుంటే మరో రేటు ఒకవేళ అత్యవసరమైతే ఇంకో ధర చెప్పి వారిని నిలువెల్లా దోచుకుంటున్నారు.

పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసి ధ్రువపత్రాలు ఇచ్చేందుకు పెళ్లి శుభలేఖ, ఫొటోలు, వయసు నిర్ధారణ ధ్రువపత్రాలు భార్యభర్తలతో పాటు ముగ్గురు సాక్షి సంతకాలు, ఆధార్‌ కార్డులు ఉండాలి. వివాహం జరిగి రెండు నెలలు దాటితే అఫిడవిట్‌ ఇవ్వాలి. ఆన్‌లైన్‌ ద్వారా రూ.500 చెల్లిస్తే స్లాట్‌బుక్‌ అవుతుంది. స్లాట్‌ బుక్‌ అయిన దాని ప్రకారం సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయాలి. దళారులు దరఖాస్తుదారుల అవసరాన్ని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు.

అవసరాన్ని బట్టి రేట్ : ఒక్క రోజులో పత్రం ఇవ్వాలంటే రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా అన్ని దస్త్రాలు లేకుండా చేయాలంటే రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. వివాహ ధ్రువపత్రాలకు లంచం తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. ధ్రువపత్రాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details