Electricity Ambulance Service in Hyderabad : మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ సేవలు అందించడం కోసం అంబులెన్స్‌లు వస్తాయన్న విషయం అందరకూ తెలిసిందే. పశువులకు కూడా ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి పవర్ కట్ అయినా అంబులెన్స్‌లు వస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఇటీవల ‘విద్యుత్తు అంబులెన్సులు’ అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని 57 విద్యుత్తు సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించారు. ఈ వాహనంలో నలుగురు సిబ్బందితో పాటు మరమ్మతులకు అవసరమైన అన్నిరకాల పరికరాలు ఉంటాయి. గతంలో వీటిని ఆటోల్లో తరలించాల్సి వచ్చేది.
పరికరాలు వాటి ఉపయోగాలు :
- ధర్మోవిజన్ కెమెరాలు విద్యుత్తు తీగలకు ఏర్పాటు చేసిన ఇన్సులేటర్ల లీకేజీ గుర్తిస్తాయి. విద్యుత్తు సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు, మరమ్మతులు చేయాల్సిన కచ్చితమైన భాగాన్ని చూపుతాయి.
- విద్యుత్తు రంపం ఇది విద్యుత్తు సరఫరా తీగలకు అడ్డుగా ఉండే చెట్ల కొమ్మలు, ఇతర భాగాలు తొలగించేందుకు వినియోగిస్తారు. నిచ్చెనను స్తంభాలు ఎక్కేందుకు ఉపయోగిస్తారు.
- సమస్య పరిష్కారానికి చేపట్టే ఆపరేషన్లలో ఉపయోగకరం.
- ఇన్స్‌లేటర్లు అనేవి విద్యుత్తు స్తంభానికి అనుసంధానం చేసే తీగలకు క్రమపద్ధతిలో ఉంచేందుకు దోహదపడతాయి. క్లాంపు బిగించే తీగల ద్వారా ఎర్త్ రాకుండా ఇన్స్‌లేటర్లు బిగిస్తారు.
- కండక్టర్ జంపర్ కట్ కారణంగా సరఫరా నిలిచిన ప్రాంతాన్ని గుర్తించేందుకు ఉపయోగపడతారు.
- ఈ వాహనంలో విద్యుత్తు తీగలు కూడా ఉంటాయి. వీటిని జంపర్లు తెగితే తాత్కాలిక సరఫరాకు వాడుతారు.
- ఇందులో ఉండే ఎర్త్ రాడ్లు మరమ్మతుల కోసం సరఫరా నిలిపేసిన ప్రాంతాల్లో సరఫరా నిర్ధారణకు ఈ పరికరాలను ఉపయోగిస్తారు.
- ఏబీ స్వీచ్ రాడ్: ఏబీ స్విచ్ ప్రాంతాల వద్ద ఆఫ్/ఆన్‌కు వినియోగిస్తారు.