EC Returned Margadarshi Chitfunds Money: ఏపీలోని విశాఖపట్నంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. చందాదారులు చెల్లించిన రూ. 51,99,800 నగదు, రూ. 36,88,675 విలువైన 51 అకౌంట్ పేయీ చెక్కుల్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమచేసేందుకు మార్గదర్శి సిబ్బంది తీసుకెళుతుండగా చెకింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
మార్చి 30, 31 తేదీలు శని, ఆదివారాలు కావడం, ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కావడంతో, 30, 31 తేదీల్లో చందాదారులు చెల్లించిన మొత్తాన్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళుతున్నామని చెకింగ్ స్క్వాడ్‌కి మార్గదర్శి సిబ్బంది తెలియజేశారు.డెయిలీ క్యాష్ రిజిస్టర్‌ని అందజేశారు. వాటిలో చిట్‌ల వివరాలు, ఎవరి నుంచి ఆ నగదు, చెక్కులు వచ్చాయో ఆ చందాదారుల పేర్లు స్పష్టంగా ఉన్నాయి. అయినా చెకింగ్ స్క్వాడ్ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం నగదు, చెక్కులను సీజ్ చేసింది. ఈ విషయాన్ని మార్గదర్శి యాజమాన్యం ఆదాయపన్ను విభాగం, రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఖాతాదారులు జమజేసిన నగదుకు రసీదులు, అంతకుముందు పదిరోజుల బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లు సహా ఆధారాలన్నీ అందజేసింది. గత సంవత్సరం ఇదే కాలానికి సంబంధించి డెయిలీ క్యాష్ రిజిస్టర్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు కూడా అందజేసింది.
పరిశీలించిన ఐటీ విభాగం: మార్గదర్శి సంస్థకు చెందిన నగదు, చెక్కుల్ని సీజ్ చేయడం సరికాదని ఐటీ విభాగం స్పష్టంచేసింది. ఆ మేరకు ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎం.రాజీవ్ రమేష్ ఏప్రిల్ 17న కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రిడ్రెసల్ కమిటీ కన్వీనర్‌కి లేఖ రాశారు. రిడ్రెసల్ కమిటీ కన్వీనర్, రిటర్నింగ్ అధికారి, పోలీసు సిబ్బంది మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. పోలీసుల నుంచి దర్యాప్తు నివేదిక రప్పించుకున్న రిటర్నింగ్ అధికారి మార్గదర్శి సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కులు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారికి ఈ నెల ఆరో తేదీన లేఖ రాశారు. ఏడో తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు. ఐటీ విభాగం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా 20 రోజుల సమయం తీసుకున్నారు.