World Telugu Writers Conference :మాతృభాషను రక్షించడంలో మీడియాది ప్రధాన పాత్ర అని ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చెరుకూరి రామోజీరావు సభావేదికపై ఏర్పాటు చేసిన 'పత్రికలు, ప్రచురణలు, ప్రసార రంగాల సదస్సు'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తెలుగు భాషపై ప్రసంగించారు.
కోర్టుల్లో అందరికీ అర్థమయ్యే భాష వినియోగించాలి :తెలుగువారి భవిష్యత్తు, భాష భవిష్యత్తు ఒకటే అని వేర్వేరు కాదని ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు. తెలుగు పరిరక్షణకు భాషాభిమానులు ముందుకు రావాలని, అలాగే మాతృభాష పరిరక్షణకు ప్రజలే నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మన పిల్లలకు తెలుగు చదవడం నేర్పాలని, మన విద్యావిధానంలో తెలుగు భాష నేర్చుకోవడం తప్పనిసరి కావాలని తెలిపారు. అధికారిక వ్యవహారాల్లోనూ తెలుగు వాడకం పెరగాలని అన్నారు. పరిపాలన, కోర్టుల్లో అందరికీ అర్థమయ్యే భాష వినియోగించాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఎప్పుడూ తమిళంలోనే మాట్లాడతారని, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలకు మాతృభాష అంటే మక్కువని గుర్తు చేశారు. మనం కూడా మాతృభాషపై అభిమానం మరింత పెంచుకోవాలని వెల్లడించారు.
ఆంగ్లంపై వ్యామోహం :తెలుగు అనేది భాష కాదు.. మన ఉనికి. మన అస్తిత్వమని, మనందరినీ కలిపి ఉంచే ఒక బంధమని నాగేశ్వరరావు తెలిపారు. జర్మన్‌లో పీహెచ్‌డీ కూడా జర్మన్ భాషలోనే చేయాలని, కొరియాలో వైద్య విద్య కూడా కొరియన్ భాషలోనే లభిస్తోందని, అందుకే ఆ దేశాలు గొప్పగా వర్ధిల్లుతున్నాయని గుర్తు చేశారు. ఆంగ్లంపై వ్యామోహంతో అపసవ్య విద్యా పోకడలకు లోనవుతున్నామని, ఇప్పటివరకు వచ్చిన నోబెల్ బహుమతుల్లో 25 శాతం కూడా ఇంగ్లీష్‌కు రాలేదని, యూరోపియన్ లాంగ్వేజెస్, జపనీస్, ఆఫ్రికన్ లాంగ్వేజెస్‌కు వచ్చాయని పేర్కొన్నాారు. ఆసియాకు ఇప్పటివరకు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఒక్కటే వచ్చిందని తెలిపారు. అధికారిక వ్యవహారాల్లోనూ తెలుగు వాడకం పెరగాలని వెల్లడించారు.