DSC Sports Quota Candidates Certificate Reverification : తెలంగాణ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పున:పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 20,21,22 వ తేదీల్లో సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ చేయనుంది. కొంతమంది అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనట్లుగా కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 393 మంది సర్టిఫికెట్లను అధికారులు మరోసారి నిశితంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అభ్యర్థులకు కీలక సమాచారాన్ని అందించింది.
డీఎస్సీ-2024 పూర్వపరాలు :ఈ ఏడాది ఫిబ్రవరి నెల 29న నోటిఫికేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు జులై 18 నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 టీచర్ ఉద్యోగాలకు గాను 2 లక్షల 46 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి 5 వ తేదీ వరకు డీఈవోల ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. వీరిలో మొత్తం 10,006 మందికి నియామక పత్రాలను అందించారు.
Confusion In Selection Of Teacher Jobs In Nizamabad : ఇదిలా ఉండగా డీఎస్సీ-2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా జరిపిన ఎంపికల్లో గందరగోళం కొనసాగింది. ఖమ్మం జిల్లాలో అర్హత లేని 7 మంది అభ్యర్థులను ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ, ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు హెచ్ఎంలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ విద్యాశాఖ అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు.