తెలంగాణ

telangana

ETV Bharat / state

జనవరి 7న విచారణకు రండి : కేటీఆర్‌కు ఈడీ నోటీసులు - ED NOTICES TO KTR

ఫార్ములా -ఈ కార్ రేస్‌ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు - జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు - ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ

KTR
ED NOTICES TO KTR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 8:57 AM IST

Updated : Dec 28, 2024, 9:49 AM IST

ED Notices to KTR : ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.

కేబినెట్‌, ఆర్థికశాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు :ఇదిలా ఉండగా ఫార్ములా ఈ-రేస్ ఒప్పందాలతో మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వానికి నష్టం కలిగించటం ద్వారా నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని హైకోర్టులో ఏసీబీ శుక్రవారం కౌంటర్ సమర్పించింది. కేబినెట్‌, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. విదేశీ సంస్థకు అనుమతి లేకుండానే రూ.54 కోట్లకు పైగా చెల్లించినట్లు అధికారులు చెప్పారు. తద్వారా హెచ్ఎండీఏపై రూ.8 కోట్లకు పైగా భారం పడిందన్నారు. ఎఫ్​ఐఆర్​ దాఖలుతోనే అసంబద్ధ కారణాలతో కేసు కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవటమేనని అధికారులు తెలిపారు.

చట్టప్రకారం లేదా వాస్తవాలు పరిశీలించినా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని, కొట్టివేయాలని ఏసీబీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మొదటి ఒప్పందం రద్దు కాగా, రెండోది 2023 అక్టోబరు 30న ఎఫ్​ఈవో, పురపాలక శాఖ మధ్య జరిగిందన్నారు. అప్పుడు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్నారు. మూడేళ్లకు ఫార్ములా ఈ-రేస్ నిమిత్తం రూ.600 కోట్లు వెచ్చించాల్సి ఉందని, ఈసీ అనుమతి లేకుండా ఒప్పందం చేసుకోవటం నియమావళికి విరుద్ధమన్నారు.

2022 ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ-రేస్‌ ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత అని, స్పాన్సర్ తరఫున చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదన్నారు. రికార్డుల ప్రకారం మాజీ మంత్రి నేరానికి పాల్పడినట్లు రుజువు అవుతోందని ఏసీబీ అధికారులు చెప్పారు. కాగ్నిజెన్స్ తీసుకునే కారణాలు ఎఫ్ఐఆర్‌లో ఉంటే ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేయవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు.

అదంతా అధికారులు చూసుకోవాలి : ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులేనని, మంత్రిగా తన బాధ్యత కాదని కేటీఆర్‌ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ దాఖలు చేసిన కౌంటరుకు కేటీఆర్ రిప్లై కౌంటర్ సమర్పించారు. విదేశీ సంస్థకు డబ్బు చెల్లింపులు, అనుమతులు అధికారులు చూసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ చట్టబద్ధమైన సంస్థ అని, చెల్లింపులు సహా అన్ని అంశాలను అదే చూసుకోవాలన్నారు. ఈసీ అనుమతి తీసుకోలేదనే ఆరోపణతో సంబంధం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రిగా విధులు నిర్వహించ లేదని, అందువల్ల తాను బాధ్యుడిని కాదన్నారు.

ప్రాథమికంగా నేరారోపణ నిర్ధారణ కాకపోవడంతో క్వాష్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. రూ.10 కోట్లకు పైబడిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదన్నారు. ఒకవేళ ఉన్నా సంబంధిత శాఖ చూసుకోవాలన్నారు. వచ్చే మూడేళ్లకు రూ.600 కోట్లు అనే వాదన సరికాదని, అంచనాలు లేకుండా ఖర్చు పెంచి చూపారన్నారు. సచివాలయం బిజినెస్ నిబంధనలు హెచ్ఎండీఏకు వర్తించవన్నారు. మిగిలిన 50 శాతం చెల్లించనందునే రూ.55 కోట్ల నష్టంతో పాటు ఇతర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నీల్సన్ నివేదిక ప్రకారం సీజన్ 9లో సర్కారుకు 83 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. నిబంధనల ఉల్లంఘనలతో నిధుల చెల్లింపులు జరిగితే, అది నేరపూరిత చర్య కాదన్నారు. రాజకీయ కక్షతోనే తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కేటీఆర్‌ కోరారు.

Last Updated : Dec 28, 2024, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details