ED Issues Notice to KTR once Again :ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న కేసులో విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. ఈనెల 16న ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది.
కేటీఆర్‌ను ఈరోజు (జనవరి 07న) విచారణ కోసం రావాలని ఈడీ గతంలోనే కోరింది. అయితే తన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు వస్తోందని, తనకు ఈరోజు కాకుండా మరింత సమయం కావాలని ఆయన ఈడీ ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపారు. దీనికి ఈడీ అధికారులు కూడా సమ్మతించారు. అయితే ఈరోజు హైకోర్టులో కేటీఆర్‌కు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.
9న విచారణకు రావాలన్న ఏసీబీ : అటు ఏసీబీ కూడా ఈనెల 9న విచారణను రావాలని కేటీఆర్‌కు నిన్న నోటీసులు జారీచేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్ తన లీగల్ టీమ్‌తో చర్చించారు. ఈ తీర్పుపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజాగా కేటీఆర్ ట్వీట్ : తాజా పరిణామాలపై 'ఎక్స్'లో కేటీఆర్ స్పందించారు. "నా మాటలు రాసిపెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు. ఈ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనేది నా అచంచల విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది" అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
తదుపరి కేటీఆర్ దారేటు : ఫార్ములా ఈ-రేసు కేసు విషయంలో తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. కేటీఆర్ మళ్లీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారా? లేదంటే హైకోర్టును కాదని సుప్రీం కోర్టుకి వెళ్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.
కేటీఆర్ పిటిషన్ వేస్తే మా వాదనలూ వినండి - సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్ పిటిషన్
కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - క్వాష్ పిటిషన్ కొట్టివేత