EC CEO Mukesh Kumar Meena key instructions: రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం నిర్వహించారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. కరపత్రాలు పంచిపెట్టేందుకూ అనుమతి తీసుకోవాలన్నారు. వీటిపై రాజకీయ పార్టీల అభిప్రాయం కోరారు. సభలు, ర్యాలీలు, ప్రచారంపై 48 గంటల ముందుగానే సువిధా యాప్, పోర్టల్ నుంచి సంబంధిత రిటర్నింగ్ అధికారికి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈసీ నిబంధనలపై అధికార, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిబంధనల వల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి.
సువిధా యాప్, పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల కోసమే సువిధా పోర్టల్ రూపొందించామని వివరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు అనుసరించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన అనుమతుల పై అవగాహన ఉండాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడూ ఈ తరహా నిబంధన లేదు. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ తరహా నిబంధనలు లేవు. ఇంటింటి ప్రచారానికి ప్రతీ ఒక్కరికీ అనుమతి కావాలనటం అభ్యంతరకరమైన విధానమని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. ఇది చాలా అభ్యంతరకరమని ఎన్నికల ప్రధానాధికారికి తెలియచెప్పామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్లోనూ ఈ తరహా నిబంధనలు లేవన్నారు. అధికార వైసీపీ ఓట్ల కొనుగోలుకు చర్చిలు, మసీదుల్లో ప్రజలకు డబ్బులు పంచుతున్నారని, ఇలా రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వకూడదు ఇది స్పష్టంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అని, దీనిపై సీవిజిల్ యాప్ ద్వారానూ ఫిర్యాదు చేశామన్నారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా, ఒత్తిళ్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు.
ఓటు ఉందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి: మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఖురేషీ