EC Arrangements TG Lok Sabha Election Counting 2024 :ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల జాతకాలు ఈ నెల 4న బయటపడనున్నాయి. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంలను భారీ భద్రత మధ్య, బరిలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరవనున్నారు. ఆ తర్వాత అందులో ఉన్న కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకొస్తారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు మొత్తం మూడు చోట్ల నిర్వహించనున్నారు.
Telangana Parliament Elections 2024 :కీసరలోని హోలిమేరీ కాలేజీ, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, బేగంపేటలోని వెస్లీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపును హోలీమేరీ కాలేజీలో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును వెస్లీ కళాశాలలో, ఎల్బీనగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు : ఆయా కేంద్రాల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఓట్ల లెక్కింపును పర్యవేక్షించనున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మొత్తానికి రిటర్నింగ్ అధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. హోలీమేరీ కళాశాలలో 20 టేబుళ్లు వేసి పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించనున్నారు.
ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఎక్కువ టేబుళ్లు వేయాలని అధికారులు నిర్ణయించారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో కుత్బుల్లాపూర్‌లో అధికంగా 592, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 591 పోలింగ్ స్టేషన్లు ఉండటం వల్ల 28 టేబుళ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మల్కాజిగిరి, కూకట్‌పల్లిలో 20 టేబుళ్ల ద్వారా లెక్కించనున్నారు.