Dussehra Celebrations 2024 First Day at Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దశావతారాల్లో అమ్మ దివ్యమంగళ స్వరూపాలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవ వెలుగులతో ఇంద్రకీలాద్రి అపర కైలాసక్షేత్రమై భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష పూజలు నిర్వహించి జగన్మాతను బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరించారు.
మొదటి రోజు తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించాలని తొలుత భావించినా ఓ అరగంట ముందే అప్పటికే క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉండడంతో వారిని దర్శనానికి అనుమతించారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఈవో కె.ఎస్. రామరావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు సతీసమేతంగా అమ్మవారి ఉత్సవ మూర్తుల వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి లాంఛనంగా దసరా ఉత్సవాలను ప్రారంభించారు.
అనంతరం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్ధసారధి, ఇతర ప్రజాప్రతినిధులు అమ్మవారి తొలి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. సామాన్య భక్తుల సంతృప్తికర దర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి ఆనం తెలిపారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఐదు క్యూలైన్లలో రెండు క్యూ లైన్లు సామాన్య భక్తుల ఉచిత దర్శనం కోసం, వంద రూపాయల టికెట్ల ద్వారా దర్శించినందుకు టికెట్ల ద్వారా దర్శించుకునేందుకు ఒక వరుస, 300 రూపాయల టికెట్లతో దర్శించుకునే వారికోసం ఒక వరుస, మూడోది 500 రూపాయల క్యూ లైన్లుగా ఏర్పాటు చేశామన్నారు.
దర్శనార్థం వచ్చే భక్తులు కొండ కింద ఉన్న అన్నదాన భవనంలో అన్న ప్రసాదం అందిస్తున్నామన్నారు. రాష్ట్రం సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొమ్మిదో తేదీ మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఉత్సవాలు ముగిసేంతవరకు తొమ్మిది రోజులు దుర్గా ఘాట్ వద్ద కృష్ణమ్మకు నవ హారతులు కార్యక్రమం జరుగుతుందన్నారు.
అమ్మవారి ఆలయంలోని ఆరో అంతస్తులో మూలవిరాట్టు మాదిరిగానే ఉత్సవ మూర్తిని కూడా బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ సహితంగా కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పంచహారతులు అనంతరం ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కలిపించారు. త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని తొలిరోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు.