Feinzel Typhoon In AP :ఫెయింజల్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు మరో రెండ్రోజులు వర్ష సూచనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
రైతులను వణికిస్తున్న ఫెయింజల్ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్
నెల్లూరు జిల్లాలో..ఫెయింజల్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. తీరప్రాంతాల్లోని మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. తుపాన్ ప్రభావంతో కృష్ణపట్నం పోర్టు వద్ద 70మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. మత్స్యకారులకు గత కొద్ది రోజులుగా వేట లేక అవస్థలు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని అనేక కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అధికారులు ముందస్తు ప్రణాళికతో రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద నీరు ఎప్పటికప్పుడు బయటకుపోవడంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందిలేకుండా కొనసాగింది. మంత్రి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తుపాన్ జాగ్రత్తలపై సమీక్షలు నిర్వహించారు. కొన్నిచోట్ల వర్షాలకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వేసిన నాట్లు మునిగిపోవడంతో రైతులు నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే నాట్లు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
''నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పొట్టెపాళెం వద్ద నెల్లూరు చెరువు కలుజు ప్రమాదకరంగా ఉంది. తుపాన్ ప్రభావంతో చెరువుకు భారీగా ప్రవాహం రావడంతో అప్రోచ్ రోడ్డు రెండు వైపులా కోతకు గురైంది. దీంతో ఐదు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు''-వాహనదారులు