Ayyannapatrudu Laid Foundation Stone for Road Works: కేంద్ర ప్రభుత్వం రాయితీ మీద పేద ప్రజలకు ఇస్తున్న బియ్యాన్ని గత ప్రభుత్వ నేతలు తక్కువ ధరకు కొనుగోలు చేసి సముద్రమార్గం ద్వారా అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ అక్రమ బియ్యాన్ని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సాహసం చేసి పట్టుకున్నారని కొనియాడారు. దీని ద్వారా వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు 48 వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్ధించినట్లు గుర్తించామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గన్నవరం సమీపంలో సుమారు 14 కోట్ల రూపాయలతో నిర్మించే రహదారి పనులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో దశలవారీగా రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించమని తెలిపారు. రానున్న నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలోని రహదారులు చెరువులు పాఠశాలలు తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా రూపకల్పన చేయాలని అయ్యన్న విజ్ఞప్తి చేశారు. ఇదే మండలానికి సంబంధించి ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 53 ఎకరాలకు సాగునీరు అందించే తాండవ జలాశయాన్ని 2,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణంతో పాటు పలు అధికారులు నాయకులు పాల్గొన్నారు.
రైతులను నిలువునా దోచేసిన వైఎస్సార్సీపీ నేతలు - రూ.350 కోట్లకు గండి