Revenue Meetings in AP : రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యుల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 8 వరకూ వీటిని నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి, 22A, ఫ్రీ హోల్డ్, భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను సర్కార్ స్వీకరించనుంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి, జల్లా స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యుల్‌ను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవడంతో పాటు ఆర్టీజీఎస్ వెబ్ పోర్టల్ ద్వారానూ దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యుల్‌ను ప్రకటించాలని పేర్కొంది. సదస్సు నిర్వహణకు రెండు రోజుల ముందే సదరు గ్రామానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు, రైతు సంఘాలతో పాటు ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలని తెలిపింది. ఆర్వోఆర్, అడంగల్, పహాణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్ లాంటి సమాచారాన్ని సదస్సుకు ముందే సిద్ధం చేసుకోవాలని వివరించింది.
AP Revenue Conference : రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించేలా ఉండాలని ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. భూసమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుమూ వసూలు చేయొద్దని ఆదేశించింది. అక్రమణల్లో భూములు కోల్పోయిన బాధితులకు సర్కార్ అండగా ఉంటూ న్యాయం చేస్తోందన్న భరోసా కల్పించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు అమలవుతున్నాయని ప్రజలకు అర్ధమయ్యేలా సదస్సులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రెవెన్యూ సదస్సుల్లో వివిధ అర్జీల పరిష్కారాన్ని కూడా రోజువారీగా పరిశీలన చేయాలని ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేసింది. పరిష్కార చర్యలు తీసుకున్నట్లు బాధితులకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇవ్వాలని తెలిపింది. సదస్సుల నిర్వహణ పర్యవేక్షణ అధికారులను జిల్లాకు ఒకరి చొప్పున నియమిస్తామని వెల్లడించింది. ప్రతిజిల్లాలో ఓ గ్రామసదస్సును జిల్లా మంత్రి ప్రారంభించాలని చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జిల్లాకు రూ.10 లక్షల చొప్పున నిధుల విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
'రెవెన్యూ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి - డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ'
'భూ కబ్జాలపై భారీగా ఫిర్యాదులు - కొత్త చట్టంతో నిందితులకు 14ఏళ్ల జైలు'