AP Ex CID Chief Sanjay Suspended : వైఎస్సార్సీపీ పెద్దల అరాచకాలకు కొమ్ముకాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా, సీఐడీ విభాగాధిపతిగా పని చేసిన సమయంలో నిధుల దుర్వినియోగం అభియోగాలపై, ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని సంజయ్‌కు స్పష్టం చేసింది.
వైఎస్సార్సీపీ హయాంలో సీఐడీ విభాగాధిపతిగా రెచ్చిపోయిన సీనియర్ ఐపీఎస్ సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు. 2024 జనవరిలో సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్ టెండర్లు పిలిచారు. దీనిలో సౌత్రికా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థలతో పాటు మరో సంస్థ కూడా పాల్గొంది. ఐతే క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను ఎల్-1గా ఎంపిక చేశారు. ఒప్పందం జరిగిన వారంలోపే ఎస్సీ సదస్సుల నిర్వహణకు 59లక్షల 52వేలు, ఎస్టీ సదస్సుల నిర్వహణకు 59లక్షల 51 నేల చొప్పున మొత్తం కోటి 19 లక్షల రూపాయలు చెల్లించేశారు. సదస్సుల నిర్వహణ అంతా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ చేపట్టాల్సి ఉన్నా, సీఐడీ అధికారులే వాటిని నిర్వహించారు. అదీ 3లక్షల 10వేలే ఖర్చు చేశారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట కోటి 15లక్షలు దోచిపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది.
దేశం దాటుతున్నCID Chief సంజయ్ -భయపడి పారిపోతున్నాడంటూ ట్రోలింగ్ - AP CID Chief sanjay on leave
ఇక ఈ ఏడాది జనవరిలో అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణకు టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు.. 3 సంస్థలకే అవకాశం కల్పించారు. ఇందులోనూ సౌత్రికా , క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌తో పాటు మరో సంస్థ టెండర్లలో పాల్గొంది. ఎల్-1 కాకపోయినా సౌత్రికా టెక్నాలజీస్‌కు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఫిబ్రవరి 15న ఒప్పందం చేసుకున్నారు. ఎలాంటి పనులూ ప్రారంభించకుండానే ఒప్పంద చేసుకున్న వారంలోపే 59 లక్షల 93 వేల రూపాయల బిల్లులు చెల్లించేశారు. దీనికోసం అధికారులపై సంజయ్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
టెండర్లు, కాంపిటీటివ్ బిడ్లు లేకుండానే లక్షా 78 వేల చొప్పున మొత్తం 10 ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లను సౌత్రికా టెక్నాలజీస్ నుంచే కొన్నారు. దీని కోసం 17లక్షల 89వేలు చెల్లించారు. ఐతే క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉనికిలోనే లేదని, అదొక డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది. హైదరాబాద్‌లో క్రిత్యాప్ సంస్థ పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లగా అక్కడ ఆ సంస్థే లేదని, అదే అడ్రస్‌లో సౌత్రిక టెక్నాలజీస్ కొనసాగుతోందని గుర్తించారు. అంటే క్రిత్వ్యాప్, సౌత్రిక రెండూ ఒకే సంస్థలని తేల్చిన విజిలెన్స్ ఈ అక్రమాలకు ప్రధాన బాధ్యుడు సంజయేనని పేర్కొంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ - 'సంజయ్' డొల్ల కంపెనీల గుట్టురట్టు