Tallest Shiva Statue in the World : ఈ సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపమే పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రముఖ శివాలయాలున్నాయి. నిత్యం ఎంతో మంది భక్తులు ఆ పరమశివుడి అనుగ్రహం కోసం భక్తి శద్ధలతో ఆయనను పూజిస్తున్నారు. అలాగే, మన దేశంలో అనేక చోట్ల శివుడి భారీ విగ్రహాలు ఉన్నాయి. ఆలయం లోపల గర్భగుడిలో కొలువుదీరిన శివలింగ దర్శనంతోనే తన్మయులైపోయే భక్తులు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపించే ఎత్తయిన శివయ్య విగ్రహాలు చూడగానే మంత్రముగ్ధులైపోతున్నారు. ఈ క్రమంలో ఎత్తైన శివుడి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ (Statue of Belief Shiva) :
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ పరమేశ్వరుడి విగ్రహం రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 369 అడుగులు. లయకారుడు ధ్యాన స్థితిలో ఉన్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం విశేషాలు
- ప్రపంచంలోనే ఎత్తైన ఈ విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45కి.మీల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది.
- సుమారు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా విగ్రహం కనిపిస్తుంది.
- పరమేశ్వరుడి విగ్రహాన్ని నిర్మించేందుకు మూడు వేల టన్నుల స్టీల్ వినియోగించారు. అలాగే, 2.5లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను ఉపయోగించారు.
- ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు 10 ఏళ్ల సమయం పట్టింది.
- ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన లయకారుడి విగ్రహం. కొత్త టెక్నాలజీతో లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించారు. ఇందులో 4 లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి.
- ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో రాత్రి పూట శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుంది.
- విగ్రహాన్ని 250కి.మీ వేగంతో వీచిన గాలినైనా తట్టుకొగలిగే సామర్థ్యంతో నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు.
- ఇక్కడికి విచ్చేసిన పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. జిప్ లైన్, బంగీ జంపింగ్, గో కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటివి చాలా ఉన్నాయి.

మురుడేశ్వర్ (Murudeshwara Shiva Statue)
కర్ణాటకలోని ప్రసిద్ధమై పుణ్యక్షేత్రాల్లో మురుడేశ్వరం ఒకటి. ఇక్కడ ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివ విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. అరేబియా సముద్రం పక్కన ఉండే ఈ శివయ్య విగ్రహాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు.

ఆదియోగి శివ విగ్రహం (Adiyogi Shiva statue)
ఆదియోగి శివ విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. ఈ విగ్రహం 112 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఇక్కడ మహా శివరాత్రి వేడుకుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు.

నామ్చి శివ విగ్రహం (Namchi Shiva statue)
నామ్చి శివ విగ్రహం సిక్కిం రాష్ట్రంలోని నామ్చిలో ఉంది. ఈ విగ్రహం 108 అడుగుల ఎత్తు ఉంటుంది. సిక్కింలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇదీ ఒకటి.
హర్ కి పౌరి శివ విగ్రహం (Har Ki Pauri Shiva Statue)
ఇది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్లో ఉంది. ఈ విగ్రహం 100 అడుగుల ఎత్తుతో గంగా నది ఒడ్డున ఉంటుంది. హర్ కి పౌరి అనేది హరిద్వార్ లోని ముఖ్యమైన ఘాట్. భక్తులు ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.
'మహాశివరాత్రి రోజున ఈ మంత్రాలు పఠిస్తే - మీపై శివ కుటుంబం అనుగ్రహం'
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?