తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల్యం ఇటుక బట్టీలో - భవిష్యత్తు అంతా బంగారు 'బడి'లో - DSC RANKERS SUCCESS STORIES

ఇటుక బట్టీల్లో బాల కార్మికురాలిగా మగ్గిన ఓ అమ్మాయికి నేడు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ‘గురు’తర బాధ్యత - ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో పలువురికి స్ఫూర్తి

DSC Rankers Success Stories in Telangana
DSC Rankers Success Stories in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 12:07 PM IST

DSC Rankers Success Stories in Telangana :ఇటుక బట్టీల్లో బాల కార్మికురాలిగా మగ్గిన ఓ అమ్మాయి, నేడు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ‘గురు’తర బాధ్యత స్వీకరించారు. ఓ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో కళాశాల మెట్లెక్కిన ఆమె, ఆ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటిన్నింటినీ లెక్క చేయకుండా కష్టాలనే మెట్లు దాటుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న ఆమె గెలుపు గాథ, ఎందరికో స్ఫూర్తిమంతం, గెలుపు పాఠం.

మంచిర్యాల జిల్లా మేమనపల్లి మండలం నీల్వాయి సమీపంలోని కేతనపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మిది చాలా పేద కుటుంబం. తండ్రి నాగయ్య, సోదరులు కూలీ పనులు చేస్తుండగా, వచ్చే కొన్ని డబ్బులతో కుటుంబం సాగేది. దీంతో కుటుంబానికి అండగా నిలవాలని తల్లి కోరిక మేరకు విజయలక్ష్మి తానూ ఇటుక బట్టీల్లో పని చేస్తూ వారానికి రెండు, మూడు రోజులే పాఠశాలకు వెళ్లేది. అలా కేతనపల్లిలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. నీల్వాయి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్​ రాచకొండ కల్యాణి విజయలక్ష్మి తరచూ బడికి గైర్హాజరవడాన్ని గుర్తించి ఆరా తీశారు. కుటుంబ సభ్యులంతా పనులకు వెళ్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితిని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని తల్లిదండ్రులను ఒప్పించి, విజయలక్ష్మి రోజూ బడికి వచ్చేలా ప్రోత్సహించారు. ఆ సహాయంతో బాలిక 2010లో పదో తరగతిలో 9.5 జీపీఏ సాధించారు.

భర్త సహాయంతో విద్యార్థికి సహాయం :పదో తరగతి కన్నా ఎక్కువ చదివితే పెళ్లి చేయడం సాధ్యం కాదని భావించిన విజయలక్ష్మి తల్లిదండ్రులు, ఆమెను ఇంటర్​లో చేర్పించేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు సింగరేణిలో ఇంజినీర్​గా పని చేసే భర్త సహాయంతో విజయలక్ష్మిని మంచిర్యాలలోని మిమ్స్‌ కళాశాలలో ఇంటర్‌ చేర్పించడంతో పాటు అక్కడే హాస్టల్‌లో బస చేసేలా ఏర్పాట్లు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఉపాధ్యాయ దంపతులు విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌లో డీఈడీ (టీటీసీ) శిక్షణ ఇప్పించారు. అనంతరం పెద్దపల్లిలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. డీఎస్సీ కోసం హైదరాబాద్‌లో మరోసారి శిక్షణలో చేర్పించారు. వారి కృషి ఫలించి, తాజాగా వెలువడిన ఫలితాల్లో టీచర్​గా నియామక పత్రం అందుకుంది.

YUVA : కలల కొలువు సాధించిన వేళ - నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయిన ఖమ్మం యువకుడు - Khammam Man Bags Four Govt Jobs

నాన్న కలను సాకారం చేయాలని :కొడంగల్ మండలం హుస్నాబాద్​కు చెందిన శ్రీశైలం గౌడ్ సన్నకారు రైతు. అతనికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో చదువుకున్న ఆయన డీఎస్సీ సాధించేందుకు శ్రమించారు కానీ సాధించలేకపోయారు. చివరికి రైతుగానే ఉండిపోయారు. ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు ఉద్యోగ సాధనలో తండ్రి పడిన శ్రమను కళ్లారా చూశారు. తండ్రి కలను సాకారం చేయాలి అనుకున్నారు. సుధ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేయగా, శ్రీకావ్య డీఎడ్ చదివారు. పదో తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూనే డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు సన్నద్దమయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్‌ కోసం సిద్ధమైన సుధ మ్యాథ్స్‌లో సెకెండ్ ర్యాంకు, ఫిజికల్‌ సైన్స్‌లో ఫస్ట్​ ర్యాంకు సాధించారు. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికయ్యారు. ఇద్దరూ బుధవారం హైదరాబాద్‌లో నియామక పత్రాలను అందుకున్నారు.

ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన అక్కాచెల్లెల్లు (ETV Bharat)

అప్పుడు వార సంతల్లో దుస్తులు అమ్మి - ఇప్పుడు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్​తో టీచర్ కొలువు - Garment Seller Select for DSC

YUVA : రైతుబిడ్డ తలరాత మార్చిన పద్యరచన - 1900లకు పైగా రచనలతో బాల కవయిత్రిగా గుర్తింపు - Sangareddy Young Poet Anitha Story

ABOUT THE AUTHOR

...view details